- 14 మందికి తీవ్రగాయాలు
- మృతుల్లో ఐదుగురు కర్ణాటక, నలుగురు ఒడిశా వాసులు
ప్రజాశక్తి-పీలేరు, చిత్తూరు అర్బన్:రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. అన్నమయ్య జిల్లా, తిరుపతిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో శుక్రవారం తొమ్మిది మంది మృతి చెందారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లా అథణి తాలూకా బడచి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 15 మంది శ్రీశైలం, తిరుమల దైవ దర్శనానికి నాలుగు రోజుల క్రితం తుఫాన్ వాహనంలో వచ్చారు. తిరుమలలో రద్దీ ఎక్కువుగా ఉండడంతో దైవదర్శనం చేసుకోకుండా గురువారం రాత్రి తమ స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున కె.విపల్లి మండలం మఠంపల్లి సమీపంలో వీరి వాహనాన్ని సిమెంట్ లారీ డీకొట్టింది. డ్రైవర్ హనుమంతు సిద్దోలు జాదవ్ (30), దంపతులు అజూరు హనుమంతు(38), అజూరు మనంద(38), తల్లీ, కుమార్తె అజూరు శోభ (36), అజూరు అంబిక(14) అక్కడికక్కడే మరణించారు. గాయపడిన 11 మందిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
బెంగళూరు నుంచి ఒడిశాకు వెళ్తున్న అంబులెన్స్ చిత్తూరు ాబెంగుళూరు బైపాస్ తెల్లగుండ్ల పల్లి వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక వైపు నుంచి ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో భువనేశ్వర్‌కు చెందిన మంజులతనాయక్, త్రిలోచన నాయక్, ఉమేష్ చంద్ర, విజరుషాకీ అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ సంజరు కుమార్, జితిన్‌కుమార్, అంబులెన్స్ టెక్నిషన్ డేపాటిరాతదాస్ తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










