- బాబుతో 40 నిమిషాల పాటు సాగిన చర్చలు
- భువనేశ్వరి వెంట బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, జగ్గంపేట : 'స్కిల్' స్కామ్ కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సోమవారం ములాఖత్‌లో భాగంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు ములాఖత్ అయ్యారు. తాజాగా జనసేన నేతలతో జరిగిన చర్చలు, లోకేష్ ఢిల్లీలో చేపట్టిన లాయర్ల కన్సల్టేషన్ గురించి వారు చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. అనంతరం జైలు వెలుపల మీడియా పాయింట్ వద్ద అచ్చెన్నాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదని, రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతోనే చంద్రబాబును అరెస్టు చేశారని విమర్శించారు.
ప్రజల సొమ్ము మాకొద్దు : భువనేశ్వరి
'ప్రజల సొమ్ము మాకొద్దు... ప్రజాసేవే మా కుటుంబానికి ముద్దు' అని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహిస్తోన్న రిలే దీక్షా శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించి మాట్లాడారు. ప్రజల సొమ్ము తినే దౌర్భాగ్య పరిస్థితిలో తాము లేమన్నారు. తాను సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నామని, దానిలో రెండు శాతం షేర్లు అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయని తెలిపారు. ఎన్‌టిఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుస్తున్నారన్నారు. ఆమె వెంట టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ తదితరులు ఉన్నారు.










