Sep 17,2023 21:52

-సనాతనం పేరుతో మహిళను వంటింటికే పరిమితం చేసే కుట్ర
-ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కన్వెన్షన్‌
- నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి- సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా):కేంద్రంలోని బిజెపి పాలనలో బేటీ బచావో.. బేటీ పడావో నినాదాలు మాటలకే పరిమితమయ్యాయని, పైగా సనాతన ధర్మం పేరుతో మహిళలను వంటింటికే పరిమితం చేసేలా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, వాటి అనుబంధ సంఘాలు వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లయోలా ఇంజనీరింగ్‌ కాలేజీలో రెండ్రోజులపాటు జరిగిన విద్యార్థినుల రాష్ట్ర కన్వెన్షన్‌ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలని, హాస్టళ్లలోని విద్యార్థినులకు శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందించాలని, పీరియడ్స్‌ సమయంలో విద్యార్థినులకు నెలకు రెండ్రోజులు సెలువులు ఇవ్వాలని, నూతన విద్యావిధానాన్ని రద్దు చేసి బాలికా విద్యను ప్రోత్సహించాలి, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మహిళా జూనియర్‌, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాలను కన్వెన్షన్‌ ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో అల్లకల్లోలం జరుగుతున్నా దానిపై నోరు మెడపని ప్రధాని మోడీ... సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై మాత్రం వెంటనే స్పందించడం సిగ్గుచేటన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి బిజెపి, దాని అనుబంధ సంఘాలు మద్దతుగా నిలవడం మహిళల పట్ల వాటి దృష్టికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. మహిళల పట్ల వివక్షను పెంచే రీతిలో వ్యవహరించే బిజెపి పట్ల రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు నోరు మెదకపోవడం బాధాకరమన్నారు.

  • నూతన కమిటీ ఎన్నిక

ఈ సందర్భంగా రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనింగ్‌ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా సిహెచ్‌.పావని, కోాకన్వీనర్లుగా టి.సుచరిత (గుంటూరు), కె.నవిత (పల్నాడు), పి.రజిత (అనంతపురం), జహీదా (ఎన్‌టిఆర్‌ జిల్లా) ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కె.సాయికుమార్‌, ఉపాధ్యక్షులు డి.అమూల్య, రమాదేవి, సహాయ కార్యదర్శులు లక్ష్మణ్‌, వి.సిద్దు, నాయకులు ప్రసాద్‌, గోవిందు, గుణ తదితరులు పాల్గోన్నారు.