Feb 10,2023 22:02

ఇండోర్‌: రంజీట్రోఫీ సెమీఫైనల్లో బెంగాల్‌ జట్టు భారీ ఆధిక్యత దిశగా దూసుకెళ్లోంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 438పరుగులకు ఆలౌటైన బెంగాల్‌ జట్టు మధ్యప్రదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 170పరుగులకే కట్టడి చేసింది. ఆకాశ్‌ దీప్‌కు ఐదు, షాబాజ్‌ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో మధ్యప్రదేశ్‌ను ఫాలోఆన్‌ ఆడించాల్సి ఉన్నా.. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్‌ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్లు నష్టపోయి 59పరుగులు చేసింది. దీంతో బెంగాల్‌ జట్టు ఇప్పటికే 327పరుగుల ఆధిక్యతలోకి నిలిచింది. కరణ్‌ లాల్‌(19), అభిమన్యు ఈశ్వరన్‌(17) ఔట్‌ కాగా.. సుదీప్‌ కుమార్‌(12), మజుందార్‌(9) క్రీజ్‌లో ఉన్నారు.
బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో సెమీస్‌లో సౌరాష్ట్ర జట్టు పోరాడుతోంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 2వికెట్ల నష్టానికి 76పరుగులతో శుక్రవారం ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర జట్టును షెల్డన్‌ జాక్సన్‌(160), కెప్టెన్‌ అర్పీత్‌ వసవాడ(112నాటౌట్‌) సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో సౌరాష్ట్ర జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్లు నష్టపోయి 364పరుగులు చేసింది. కావెరప్పకు రెండు, కౌశిక్‌, గౌతమ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక జట్టు 407పరుగులు చేసిన సంగతి తెలిసిందే.