May 19,2023 09:29
  • ప్లే˜-ఆఫ్‌ ఆశలు సజీవం
  • కోహ్లి శతకం, డుప్లెసిస్‌ అర్ధ శతకం

హైదరాబాద్‌ : ప్లే-ఆఫ్‌ చేరాలంటే కీలకమైన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రెచ్చిపోయింది. గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలోనే అధిగమించింది. కోహ్లి 100 పరుగులు (63 బంతుల్లో 4 సిక్స్‌లు, 12 ఫోర్లు) చేయగా, డుప్లెసిస్‌ 71 పరుగులు ( 47 బంతుల్లో 2 సిక్స్‌లు, 7 ఫోర్లు) చేశారు. తరువాత మ్యాక్‌వెల్‌ (5), బ్రాస్‌వెల్‌ (4) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. గురువారం మ్యాచ్‌లో ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఐపిఎల్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. కేవలం 51 బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సర్ల సాయంతో 104పరుగులు చేసి ఔటయ్యాడు. త్రిపాఠి(15) ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన క్లాసెన్‌ బౌలర్‌ ఎవరైనా సరే లెక్క చేయకుండా బెంగళూరు బౌలర్లను ఉతికారేశాడు. హ్యారీ బ్రూక్‌(27నాటౌట్‌; 19బంతుల్లో 2ఫోర్లు, సిక్సర్‌) వేగంగా ఆడాడు. అంతకుముందు, ఓపెనర్లు అభిషేక్‌ శర్మ(11), రాహుల్‌ త్రిపాఠి(15) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. కెప్టెన్‌ ఐడెన్‌ మార్‌క్రమ్‌ 20 బంతుల్లో 18 పరుగులు చేసి షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌ లో బౌల్డయ్యాడు. ఆఖరి ఓవర్లో సిరాజ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడమే కాకుండా, ఇన్నింగ్స్‌ చివరి బంతికి గ్లెన్‌ ఫిలిప్స్‌(5)ను అవుట్‌ చేశాడు. బెంగళూరు బౌలర్లలో మైకేల్‌ బ్రాస్‌వెల్‌కు రెండు, సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, హర్షల్‌ పటేల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.