Oct 08,2023 12:51

అమరావతి : బండారు సత్యనారాయణపై న్యాయ పోరాటం చేస్తానని ఎపి మంత్రి రోజా అన్నారు. ఇటీవల మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండారు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణపై మరోసారి మంత్రి రోజా నిప్పులు చెరిగారు. బండారు లాంటి చీడ పురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళను ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆ దిశగా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని తక్షణమే రిమాండ్‌కు తరలించేలా చట్టాలు కఠినంగా ఉండాలన్నారు. బండారుపై న్యాయ పోరాటం చేస్తానన్న మంత్రి రోజా.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వెళతానని చెప్పారు. బండారుపై క్రిమినల్‌, సివిల్‌ పరువునష్టం దావాలు వేస్తానని రోజా తెలిపారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండారు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయడం తెలిసిందే. ఆ తర్వాత బండారు బెయిల్‌పై విడుదలయ్యారు. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలను సినీ ఇండిస్టీకి చెందిన నటీమణులు తీవ్రంగా ఖండించారు. కుష్బు, రాధిక శరత్‌ కుమార్‌, రమ్యకృష్ణ, మీనా, నవనీత్‌ కౌర్‌, నటి కవిత తదితరులు మంత్రి రోజాకు బాసటా నిలుస్తున్నట్లు ప్రకటించారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.