Oct 04,2023 10:43

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సిఎం జగన్‌, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచికత్తుతో విడుదల చేసింది. సత్యనారాయణ మూర్తిని సోమవారం రాత్రి విశాఖపట్నం జిల్లాలో అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. సిఎం, మంత్రి రోజా ప్రతిష్టను దిగరార్చే విధంగా కుట్రచేశారన్న అభియోగంపై 153ఎ, 354ఎ, 504, 505, 506, 509, 499 120బి ఐపిసి, 67 ఐటి యాక్ట్‌ కింద బండారు సత్యనారాయణ మూర్తిపై కేసులు నమోదు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం 5.40 గంటల ప్రాంతాల్లో స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో హాజరుపరిచారు. దాదాపు మూడు గంటల విచారణ అనంతరం న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. అంతకు ముందు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఉన్న బండారును కలిసేందుకు వచ్చిన టిడిపి నాయకులను పోలీసులు అనుమతించలేదు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో పలువురిని గృహనిర్బంధంలో ఉంచారు.
 

                                                                  హైకోర్టులో రేపు విచారణ

ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి రోజాపై అనుచిత విమర్శలు చేశారనే కేసు విచారణను ఎదుర్కొంటున్న బండారు సత్యనారాయణమూర్తికి సీఆర్‌పీసీలోని 41ఎ నోటీసు ఇచ్చామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నోటీసు జారీ చేస్తే దానిని తీసుకోలేదని, మరో కేసులో నోటీసు ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పింది. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రారు, జస్టిస్‌ టి. రాజశేఖర్‌రావుల డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఆదేశించింది. 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు రావాలని చెప్పిన వెంటనే అరెస్టు చేశారని బండారు లాయర్‌ చెప్పారు. విచారణను గురువారానికి వాయిదా వేసింది.