May 16,2023 21:55

కౌలాలంపూర్‌: భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో నిలిచాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్‌) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ 7వ స్థానంలో నిలిచాడు. 30ఏళ్ల ప్రణరు ఇంతకుముందు 8వ ర్యాంక్‌లో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌ టాప్‌-10లో మరెవ్వరూ చోటు దక్కించుకోలేకపోయారు. లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌ 22, 23 ర్యాంకుల్లో ఉండగా.. మహిళల సింగిల్స్‌లో పివి సింధు టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో సింధు 11వ స్థానంలో నిలిచింది. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్‌ జోడీ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ 15కు ఎగబాకారు. అంతకుముందు 17వ ర్యాంక్‌లో ఉన్న వీరు తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నారు. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్త్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 7వ ర్యాంక్‌లో నిలిచింది.