Oct 05,2023 22:47

-స్టీల్‌ప్లాంట్‌ రక్షణ పోరాటానికి 'ఇండియా'లో పార్టీలను సిద్ధం చేస్తాం
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
విశాఖలో ఉక్కు రక్షణ సభకు వేలాదిగా తరలచ్చిన ప్రజలు
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో: దేశ ప్రజల సంపదైన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలంటే కేంద్రంలో బిజెపిని 2024 ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. అప్పుడే రాజ్యాంగాన్ని కాపాడుకుని మతోన్మాదులను తరిమికొట్టిన వాళ్లమవుతామన్నారు. గురువారం సాయంత్రం కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద సిపిఎం ఆధ్వర్యాన జరిగిన 'ఉక్కు రక్షణ బహిరంగ సభ'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన 'ఇండియా' వేదికలో పార్టీలను పోరుకు తాను సిద్ధం చేస్తానని ఆయన ప్రకటించగానే సభకు హాజరైన వేలాది మంది ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఇండియా వేదికలోగల పార్టీలు ఇప్పటికే దేశ సంపదైన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడతామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో లక్షల మందికి నష్టం చేకూర్చే విధానాలపై రైతులు పోరాడిన తీరుతో మోడీ తన జీవితంలో ఒకసారి వెనకడుగు వేశాడని పేర్కొంటూ, ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని ఉటంకించారు. ఆ పోరాట స్ఫూర్తితో ఉక్కు రక్షణకు కార్మికవర్గం మరింత గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలకు ప్రజలు యజమానులని, పాలకులు మేనేజర్లు మాత్రమేనని, యజమానులకు తెలియకుండా మేనేజర్లు ఎలా అమ్ముతారు? వారికి అమ్మే అర్హత ఎక్కడిది? అని ఏచూరి అనగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది. దేశ సహజ వనరులు, సంపదలను విదేశాలకు దాసోహం చేసేలా మోడీ విధానం ఉందన్నారు. 1947 తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగం ఏ సంవత్సరమూ లేదని వివరించారు. 22 నెలలుగా ధరలు ఆకాశాన్నంటుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన జి-20 సమావేశాలకు రూ.4,100 కోట్లను మోడీ ఖర్చు చేశారన్నారు. తొమ్మిదేళ్లలో మోడీ దేశంలో పెట్టుబడిదారులకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, స్టీల్‌ప్లాంట్‌కుగల చిన్న నష్టాన్ని ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో బిజెపి మతోన్మాద దాడులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పురాణాల్లో క్షీరసాగర మథనం జరిగిన వైనాన్ని వివరిస్తూ, చెడ్డవారి చేతుల్లో నేడు అమృతం ఉందని, ప్రజల చేతుల్లోకి దాన్ని తేవాల్సి ఉందని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడం కోసం 'ఇండియా' వేదికగా చర్చలు జరిపి ఫలప్రదమైన నిర్ణయాలు చేయనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ లేదు, కడప స్టీల్‌ప్లాంట్‌ రాలేదు, నష్టాలు చూపించి వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను తెగనమ్మాలని బిజెపి చూస్తోంది అంటూ మండిపడ్డారు. 'ఇప్పటివరకూ 965 రోజులుగా పోరాడుతున్నారు. గెలిచేవరకూ సిపిఎం మీతోనే ఉంటుంది. మోడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడండి' అని ఉక్కు దీక్షాపరులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉక్కు జోలికొస్తే ప్రజలు అంతు చూస్తారు : వి శ్రీనివాసరావు
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమ్మితే ప్రజలు వారి అంతు చూస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ప్రజల శ్రమ ఫలితమని అన్నారు. మొన్నటి వరకూ ప్లాంట్‌ను అమ్మేస్తాం... అమ్మేస్తాం అన్న మోడీ... నేడు చంపేస్తాం... చంపేస్తాం అంటున్నారని, అమ్మితే అంతు చూస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. అభివృద్ధి నినాదంతో మోడీ అధికారంలోకి వచ్చి దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని, ఇలాంటి ప్రజా ఉద్యమ సభలతో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు సమాధానం చెబుతామని అన్నారు. రాష్ట్రాన్ని అదానీ, అంబానీలకు ధారాదత్తం చేసేందుకు చూస్తున్నారని, ఆ క్రమంలోనే రూ.3 లక్షల కోట్ల విలువైన ప్లాంట్‌ సంపదపై వారి కళ్లు పడ్డాయని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ విషయంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీ ఎందుకు మౌనం దాల్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు మోడీ ఉరివేస్తానంటే తాడును జగన్‌ అందిస్తారా? అంటూ ప్రశ్నించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రభావతి, సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యరాం, సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శులు మాట్లాడారు. వేలాది మంది రాకతో కూర్మన్నపాలెం పరిసరాలు ఉక్కు నినాదంతో హోరెత్తాయి. ప్రజానాట్య మండలి కళాకారుల ప్రదర్శనలు చైతన్యం నింపాయి. ఉక్కు రక్షణ బైకు యాత్రలో పాల్గన్న వారికి వేదికపై అతిథులు జ్ఞాపికలు అందజేశారు.