Sep 11,2022 08:09
  • మతాల ఘర్షణగా చిత్రీకరించే కుట్ర
  • చరిత్రను వక్రీకరించే వారికి ప్రజా తిరస్కారం తప్పదు
  • చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా భూపోరాటం : బృందాకరత్‌


ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వర్గపోరాటమని చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుంటే, దాన్ని హిందూ, ముస్లిం ఘర్షణగా చిత్రీకరించేందుకు బిజెపి వక్రీకరిస్తోందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. సిపిఎం హన్మకొండ జిల్లా కన్వీనర్‌ బొట్ల ప్రభాకర్‌ అధ్యక్షతన శనివారం హన్మకొండలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు ఆమె ప్రధానవక్తగా విచ్చేశారు. చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బృందాకరత్‌ మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన చాకలి ఐలమ్మ నిజాం రాజును వణికించిందని గుర్తు చేశారు. ఆమె ఏ సమస్యల పరిష్కారం కోసమైతే పోరాటం చేశారో, ఆ సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఒకవైపు బ్రిటీష్‌ పాలకులు, మరోవైపు సామంత నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటానికి ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టు పార్టీ, ఎర్రజెండా అండగా నిలిచిందని గుర్తు చేశారు. బానిసత్వం పేరుతో, వెట్టి పేరుతో దేశ్‌ముఖ్‌లు, నిజాం రాజు శ్రమదోపిడీ చేశారని తెలిపారు. జమిందారు దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ నిలబడిందన్నారు. ఐలమ్మ భర్తను అన్యాయంగా అరెస్టు చేసి జైలు పాలు చేసి, ఆమె కూతురుపై సామూహిక లైంగిక దాడి చేసినా పోరాడం నుంచి వెనుకడుగు వేయని వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. ఆనాడు ఆమెకు కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచిందన్నారు. ఆమె స్ఫూర్తితో మూడు వేల గ్రామాలకు ఎర్రజెండా విస్తరించి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిందని తెలిపారు. నిజాం మతానికి వ్యతిరేకంగా కాకుండా తమ హక్కులు, అధికారాల కోసం ప్రజలు ఒక్కటిగా నిలబడి పోరాడారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియాలో కలపబోనని చెప్పిన నిజాం... భారత సైన్యం ఒత్తిడికి లొంగి 1948 సెప్టెంబర్‌లో భారత్‌లో విలీనం చేశారని తెలిపారు. అందుకు ప్రతిగా నెహ్రూ సర్కారు నిజాంకు రాజ్‌ ప్రముఖ్‌ బిరుదునిచ్చిందని అన్నారు. మూడు వేల గ్రామాల్లో కమ్యూనిస్టులను వెతికి నిజాం కన్నా ఎక్కువగా హింసించి భారత సైన్యం చంపిందని తెలిపారు. నిజాంను మించిన అరాచకత్వాన్ని ప్రదర్శించిందన్నారు. ఇది వాస్తవ చరిత్ర అనీ, దీన్ని ఏ మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పెట్టుబడీదారీ, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మోడీ బ్యాచ్‌ వక్రీకరిస్తోందని అన్నారు. నాటి పోరాటంలో హిందువులు, ముస్లిములు ఉన్నారని, నేటికీ భూమి కోసం జరుగుతున్న పోరాటంలోనూ వారు ఉన్నారని తెలిపారు. బిజెపి ప్రత్యేకమైన కళ్లద్దాలు పెట్టుకుని చరిత్రను చెబుతోందని విమర్శించారు. పేదల శత్రువు ఏ ఒక్క మతమూ కాదని, దోపీడీ వర్గమే మన శత్రువని పునరుద్ఘాటించారు. కేంద్రంలోని బిజెపి సర్కారు అనుసరిస్తోన్న విధానాల ఫలితంగా దేశంలో అసమానతలు పెరిగితున్నాయని తెలిపారు. దేశంలో వందమంది ధనవంతులకు రోజుకు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుంటే, పేదలకు నెలకు రూ.10 వేలు నుంచి రూ.15 వేలు రావడం కూడా రావడం లేదన్నారు. బిజెపి ప్రభుత్వం ఒకవైపు దోపిడీని ప్రోత్సహిస్తూ, మరోవైపు సంఘటితమైన పేదలను మతం పేరుతో చీల్చే కుట్రలు చేస్తోందని విమర్శించారు. మనువాదం పేరుతో మరోసారి బానిసత్వంలోకి తీసుకెళ్లాలని చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బిల్కిస్‌ బానో లైంగిక దాడి ఘటనలో కోర్టు నేరస్థులుగా నిర్ణయించి శిక్ష వేసిన వారిని బిజెపి సర్కారు వదిలిపెట్టడాన్ని ఏ భారతీయ మహిళా క్షమించబోదని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేదని బృందాకరత్‌ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతి మాటలో విషం ఉందని, ప్రజల ఐక్యత, న్యాయపోరాటమే దానికి విరుగుడని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించే వారిని ఎన్నటికీ అంగీకరించవద్దని తెలంగాణ ప్రజలను కోరారు. బిజెపి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐకమత్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. వారికి ఎర్రజెండా అండగా ఉంటుందని అన్నారు.