Jul 02,2023 21:36

లార్డ్స్‌ వేదికగా జరిగిన యాషెస్‌ రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్‌ దూసుకెళ్లింది. 371 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 327 పరుగులకు ఆలౌటైంది.114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్‌ మొదలెట్టిన ఇంగ్లడ్‌ జట్టు అదనంగా మరో 213 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(155), బెన్‌ డకెట్‌(83) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో ప్యాట్‌ కమ్మిన్స్‌, హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌ తలా 3 వికెట్లు, గ్రీన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. 

ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కంగారూలు 279 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఇంగ్లండ్ ఛేదనలో విఫలమైంది. 327 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. 

బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన పోరాటం

2

లార్డ్స్‌ వేదికగా జరిగిన యాషెస్‌ రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఓడినా.. ఆ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఓవరాల్‌గా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 214 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్‌ 155 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉండడం గమానార్హం. ఇక అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన బెన్‌స్టోక్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, ఖ్వాజా, కెప్టెన్‌ కమ్మిన్స్‌ స్టోక్స్‌ ఔటైన వెంటనే దగ్గరికి వెళ్లి మరి అభినందించారు. టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి సైతం బెన్‌స్టోక్స్‌ను అభినందించాడు.