ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆధారాలు లేని కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. జెడ్‌ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదని తెలిపారు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించారని పేర్కొన్నారు. చంద్రబాబును ఇలానే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారని, ఆయనకు ఏం జరిగినా జగన్‌దే బాధ్యత అని అన్నారు.










