Sep 17,2023 21:46

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :పార్టీ నేతలను ప్రజల్లోకి పంపడానికి వైసిపి సిద్ధమౌతోంది. దీనికోసం 'పల్లెకు పోదాం' పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. నెలాఖరులో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ పార్టీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ప్రతి మండలంలో పార్టీ మండలాధ్యక్షులు రోజుకో సచివాలయం పరిధిలో తిరిగి, రాత్రికి అక్కడే బసచేస్తారు. లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు కూడా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తప్పని సరిగా ప్రభుత్వ పథకాలు పొందిన లబ్దిదారులను కలిసి జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అందించినవేనని, రానున్న ఎన్నికల్లో మీ సహకారం కావాలని కోరాలని కూడా పార్టీ సూచించనుంది. రాత్రికి బస చేసే గ్రామంలో గ్రామ కమిటీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం , తటస్థులను పార్టీలో చేరే విధంగా నచ్చజెప్పే విధంగా కృషిచేయడం వంటి పనలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేనాటికి లబ్ధిదారుల జాబితాను తయారు చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి ఎన్ని పథకాలు అందాయి? ఎంతమేర లభ్ధి చేకూరింది? అనే విషయాలను నమోదు చేసిన కౌంటర్‌ ఫైలును లబ్ధిదారులకు అందజేయనున్నారు. గ్రామ వాలంటీర్లు సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో '' మా నమ్మకం నువ్వే జగనన్న'' పేరుతో డిస్‌ప్లే బోర్డులను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఆయా బోర్డుల్లో ఒక వైపు ముఖ్యమంత్రి బమ్మ ఉండనుండగా, మిగిలిన భాగంలో పథకం పేరు, లబ్ధిదారుల సంఖ్య, అందించిన లబ్ధి (డిబిటి ద్వారా నేరుగా నగదు రూపంలో) వివరాలను నమోదు చేయనున్నారు. అదే విధంగా నాన్‌ డిబిటి కింది అందించిన 8 పధకాల వివరాలను కూడా నమోదు చేసే విథంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.