ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : సిఎం పర్యటన వేళ ... ఆదోనిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు ఆదోని శివారులోనే పర్వతాపురం కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసులు ఇంటికి వన్ టౌన్ పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సిఎం పర్యటన సందర్భంగా ముందస్తుగా, పోలీసులు తమను అరెస్టు చేయడం సమంజసం కాదని అభ్యంతరం తెలిపారు. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్ నుంచి 77 చెరువులకు నీరు అందించే పథకాన్ని, మంగళవారం 19వ తేదీన ప్రారంభించేందుకు సిఎం జగన్ కర్నూలుకు రానున్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటారన్న నెపంతో ఆదోని పోలీసులు తమను ముందుగానే నిర్బంధించడం భావ్యం కాదన్నారు. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే వారిని అణిచివేయాలన్న ఆలోచన విధానాన్ని సిఎం జగన్ మార్చుకోవాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో విద్యార్థుల నుండి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.










