Jul 03,2023 20:59
  • లార్డ్‌ లాంగ్‌ రూమ్‌ ముగ్గురిపై వేటు

లార్డ్స్‌: క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించిన ఆస్ట్రేలియాల ఆటగాళ్లపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌లో భాగంగా ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెయిర్‌స్టోను వివాదాస్పదంగా స్టంపౌట్‌ చేయడం వివాదాస్పదమైంది. బెయిర్‌స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి ఇది అనైతికమని ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌తో బెయిర్‌స్టో, మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ స్టోక్స్‌ మాట్లాడినా ఫలితం లేకపోయింది. బెయిర్‌ స్టో క్రీజులో ఉంటే తమకు విజయం దక్కదని భావించిన ఆసీస్‌ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు. ఆ తర్వాత లంచ్‌ విరామంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు లార్డ్స్‌ లాంగ్‌ రూమ్‌ వెళ్తున్నప్పుడు ముగ్గురు మేరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసిసి) సభ్యులు అసభ్యంగా ప్రవర్తించడం, ఛీటర్స్‌ అంటూ ఎగతాళి చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లంచ్‌ సమయంలో ఆసీస్‌ ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసీస్‌ ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్‌ వార్నర్‌లను ఛీటర్స్‌ అంటూ ముగ్గురు ఎంసిసి సభ్యులు దూషించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎంసిసి వారిని సస్పెండ్‌ చేసింది. భవిష్యత్తులో లార్డ్స్‌ మైదానంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.