Dec 26,2022 08:38

ప్రఖ్యాత చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు తెలుగు నేలకు ఒక రంగుల వన్నె. ఆయన 1919 నవంబర్‌ 14వ తేదీన అప్పటి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిలో జన్మించారు. తండ్రి రాజయ్య దాసు, తల్లి నరసమ్మ. రాజయ్య దాసు తత్వాలను రాసేవారు. కొన్నాళ్లు పెద నాన్న వద్ద ఖరగ్‌పూర్‌లో చదువుకున్న పైడిరాజు ... స్కూలు నుంచి రాగానే, చిత్రకళ నేర్చుకుంటున్న పెదనాన్న గారి చిత్రాలను పూర్తి చేసేవాడు. అది గమనించిన పెదనాన్న ... పైడిరాజును కూడా తనతో పాటు చిత్రకళా గురువు వద్దకు తీసుకు వెళ్లేవాడు. అలా చిన్ననాడే పైడిరాజుకు చిత్రకళ పట్ల ఆసక్తి, అభినివేశం ఏర్పడ్డాయి. తరువాత 1935లో విజయనగరం వచ్చి, మహారాజా ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. చిత్రకళ సాధన కొనసాగించారు. పూసపాటి లక్ష్మీనరసింహరాజు ఆయన్ని 1940లో మద్రాసులోని 'స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌'లో చేరేందుకు ప్రోత్సహించారు. సంగీత కార్యక్రమాల్లో పాడుతూ, తబలా వాయిస్తూ, వచ్చిన కొద్దిపాటి పైకంతో జీవిస్తూ... చిత్రకళను అభ్యసించాడు. దేవీప్రసాద్‌ రాయచౌదరి శిక్షణలో ఆరేళ్ల కోర్సును నాలుగేళ్లలో పూర్తి చేసి, 1944లో ప్రథమ శ్రేణి డిప్లమో పొందారు. తరువాత తన సాధనకు విజయనగరాన్నే స్థానంగా ఎంచుకున్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంఓ పైడిరాజు తన కళ ద్వారా ప్రజలను చైతన్య పరచడానికి విశాఖపట్నం, శ్రీకాకుళం, కాశీబుగ్గ మొదలైన ప్రాంతాలను పర్యటించారు. దుర్భర దారిద్య్రంతో అల్లాడే పేదల జీవన దృశ్యాలు అనేకం చిత్రించారు. అప్పట్లో ప్రజాశక్తిలో ప్రచురించిన ఉత్తరాంధ్ర కరువు దృశ్యం ఇప్పుడొక చారిత్రక సాక్ష్యం. అప్పట్లో విజయనగరంలోగల రోణంకి అప్పలస్వామి, చాగంటి సోమయాజులు, శ్రీరంగం నారాయణబాబు వంటి సాహిత్య వేత్తలతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1948లో మెయిన్‌ రోడ్డులోని రాతి మేడలో ఉంటూ విద్యార్థులకు చిత్రకళా పాఠాలు మొదలుపెట్టారు. 1950 నాటికి ఒక చిత్రకళ పాఠశాలను నిలబెట్టుకున్నారు. 1952లో దానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. పి.వి.జి రాజు తమ కోటలోని చిత్ర కళాశాల నడపడానికి అనుమతించి, పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలను కూడా కల్పించారు. అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు తరువాతి కాలంలో చిత్రకళోపాధ్యాయులుగా, ప్రఖ్యాత చిత్రకారులుగా స్థిరపడ్డారు.
        మహారాజ కళాశాల ప్రిన్సిపల్‌ ఎ.ఎల్‌ నారాయణ సూచన మేరకు - ఆ కళాశాల విద్యార్థుల్ని మద్రాసు, అజంతా, ఎల్లోరా, బొంబాయి, కలకత్తా, బోల్పూరు (శాంతినికేతన్‌) తదితర పట్టణాలకు తీసుకెళ్లి, ఆయా ప్రాంతాల కళల్లో ఉన్న వైవిధ్యతలను బోధించారు. అప్పుడే ప్రముఖ ఆంగ్ల పాత్రికేయులు ఎ.ఎస్‌ రామన్‌ని, బోల్పూరులో నందలాల్‌ బోసునూ కలుసుకున్నారు. అంట్యాకుల 1961లో ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీకి సభ్యుడయ్యారు. 1972-77 కాలంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. 1962లో విశాఖపట్నంలో చిత్రకళా పరిషత్తును స్థాపించారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభ వీరిని ఘనంగా సత్కరించింది. ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి సహాయంతోనే పైడి రాజు సుమారు 26 ఏళ్లు స్కూలు నడిపారు. 1977లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'ఫైన్‌ ఆర్ట్స్‌' ప్రారంభించడంతో అప్పటి వైస్‌ ఛాన్సలర్‌ ఎం.ఆర్‌ అప్పారావు పిలుపు మేరకు చిత్రకళోపన్యాసకులుగా చిత్రకారుడు లక్ష్మయ్య గారితో కలిసి పనిచేశారు.
          జానపద శైలిలో చిత్రాలను చిత్రించడంలో అంట్యాకుల తనకు తానే సాటి. మూర్తి చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు, నీటిరంగు చిత్రాలు, రేఖా చిత్రాలు అద్భుతంగా గీసేవారు. కాంస్య, ఇతర లోహ శిల్పాలు చెక్కే నైపుణ్యం కూడా వీరికి ఉంది. కళింగాంధ్ర గ్రామీణ సంస్క ృతి, కట్టూబొట్టూ, ఆభరణాలు, అలంకారాలు ఆయన చిత్రాల్లో కనిపిస్తాయి. వీరి చిత్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లలిత కళా అకాడమీలోనూ, సాలార్జంగ్‌, త్రివేండ్రం, కలకత్తా బిర్లా మ్యూజియంలలోనూ, న్యూఢిల్లీలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ ఉన్నాయి. రష్యా, కాబూల్‌, చైనా, అమెరికా, జర్మనీ, మలేషియా వంటి అనేక దేశాల్లో వీరి చిత్రాలు గ్యాలరీల్లో అలంకరించ బడ్డాయి. 'తిలకం' అనే వర్ణ చిత్రానికి పంజాబ్‌ ప్రభుత్వం బంగారు పతకం బహుకరించింది. 'భగవీణ, ఊరేగింపు' చిత్రాలకు విశాఖపట్నం ఎగ్జిబిషన్లో అవార్డు, బంగారు పతకం లభించాయి. 'తెగిన తీగ, పేరంటం, తూర్పా రబోత, నావికులు, ఆకలి, అలంకరణ, సంతకు, పల్లెటూరు దృశ్యం' మొదలైనవి వీరి పేరెన్నికగన్న చిత్రాల్లో కొన్ని. 'స్నానానంతరం, నవ్యమార్గం' అనే రెండు చిత్రాలు కాబుల్‌, కైరో లలో జరిగిన ప్రదర్శనలలో విక్రయించబడ్డాయి. పలు చిత్రాలు ప్రముఖ ఆంధ్ర, ఆంగ్ల పత్రికల్లో అచ్చయ్యాయి. విశాఖపట్నం మెయిన్‌ రోడ్డు మీద, ఆర్టీసీ కాంప్లెక్స్‌ దరిలోనూ చేసిన గురజాడ అప్పారావు, అల్లూరి సీతారామరాజు, జవహర్లాల్‌ నెహ్రూ, రుద్రమదేవి కాంస్య విగ్రహాలు వీరి ప్రతిభకు గీటురాళ్లుగా కనబడతాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ, గౌరవ డాక్టరేట్‌ బిరుదులతో సత్కరించింది. వీరి పెద్ద కుమారుడు రాజేశ్వరరావు హైదరాబాదులో, రెండో కుమారుడు నాగేష్‌ విశాఖపట్నంలో చిత్రకారులుగా స్థిరపడ్డారు. పైడిరాజు విద్యార్థి దశలో మద్రాసులో సంగీత కచేరీలు చేశారు. నాటకాల్లో చిన్నచిన్న వేషాలు వేశారు. కొన్ని కవితలు రాసి 1976లో 'అక్షర శిల్పాలు' సంపుటిగా ప్రచురించారు. 1990లో 'అక్షర చిత్రాలు, కథలు-వ్యాసాలు' అనే చిన్న కథా పుస్తకం వెలువరించారు.
             ఆయన సాహిత్యరంగ ప్రవేశం ఆసక్తికర విషయం. రోణంకి అప్పలస్వామి, ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణ బాబు, చాసో గార్లతో పరిచయమున్న రోజుల్లో రచనా వ్యాసంగం పట్ల దృష్టి సారించలేదు. 1972లో ఆరుద్ర, అనిశెట్టి, దాశరథి, సోమసుందర్‌ గార్ల పిలుపు మేరకు నేను (సీరపాణి) అప్పటికి విజయనగరం సంస్క ృత కళాశాల విద్యార్థిగా ఉన్నప్పటికీ, చాసో గారితో పాటు ఆంధ్ర 'అభ్యుదయ రచయితల సంఘం' పునర్నిర్మాణం చేశాం.. విజయనగరం శాఖకు చాసో అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు- పైడిరాజు కార్యవర్గ సభ్యులు. ఇంకా పి.ఎల్‌.పి రాజు, పెనుమత్స అప్పలరాజు, దంతులూరి రామరాజు, బులుసు జీప్రకాష్‌ కార్యవర్గ సభ్యులు. ఎ.బి సుబ్బారావు, యు.ఎ నరసింహమూర్తి, ద్వారం దుర్గాప్రసాదరావు, అరుణ కిరణ్‌, ఎన్‌.వి రమణారావు మొదలైన రచయితలు పాల్గొనేవారు. అరసం సమావేశాలు పైడిరాజు గారి ఆర్ట్‌ గ్యాలరీలోనే జరిగేవి. అరసంకు ఒక ఎంబ్లెమ్‌ కూడా ఆయన వేశారు. సాహిత్య కార్యక్రమాలకు గురజాడ, గిడుగు, కందుకూరి వంటి సాహితీమూర్తుల రేఖాచిత్రాలు రూపొందించేవారు. సాహిత్య చర్చలన్నింటినీ ఓపికగా వినేవారు. ఇలాంటి వాతావరణంలో ఆయనకు కవిత్వం రాయాలనే కుతూహలం కలిగింది. 55 ఏళ్ల వయసు పైబడిన తర్వాత రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1998 డిసెంబర్‌ 26న తన 78వ ఏట కన్నుమూశారు. తన రేఖా కథా చిత్రాలతో, శిల్పాలతో సజీవమూర్తిగా కనిపించే అంట్యాకుల పైడిరాజు నిజమైన ప్రజాపక్ష చిత్రకారుడు. బహుముఖీన సృజనకారుడు. ఆయనకు నివాళి.

(డిసెంబర్‌ 26 : అంట్యాకుల పైడిరాజు వర్ధంతి)
- సీరపాణి
87902 32565