ప్రజాశక్తి- తిరుమల : తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో టిటిడి ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. కొద్ది రోజుల క్రితం కాలినడక మార్గంలో చిన్నారి లక్షితపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే 2850 మెట్టు దగ్గర టిటిడి అటవీశాఖ అధికారులు చిరుత కోసం బోను ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున బోనులో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా అదే ప్రాంతంలో చిరుత తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. బోనులో చిక్కిన చిరుతను చిరుతను అధికారులు తిరుపతిలోని జూపార్క్‌కు తరలించారు. ఇప్పటి వరకూ మొత్తం 6 చిరుతలు చిక్కాయి. వాటిలో నాలుగింటిని జూపార్క్‌కు తరలించారు. రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
బోనులో చిరుత చిక్కిన ప్రాంతాన్ని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. గడిచిన రెండు నెలల కాలంలో ఇప్పుడు పట్టుబడిన చిరుతతో కలిపి మొత్తం ఆరు చిరుతలను పట్టుకున్నట్లుగా తెలిపారు. యాత్రికుల భద్రతపై టిటిడి ఎంత చిత్తశుద్ధితో ఉందో తెలుసుకోడానికి ఇదే ఉదాహరణ అని ఆయన తెలిపారు. యాత్రికులు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్నీ చర్యలు టిటిడి తీసుకుంటుందని చెప్పారు. ఆపరేషన్ చిరుత కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ఇంకా తిరుగుతున్న చిరుతలను పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 300పైగా ట్రాప్ కెమెరాలతో నిఘా పర్యవేక్షణ చేస్తున్నట్లుగా చెప్పారు.










