క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నీని ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో టోర్నీ విజేత శ్రీలంక నుంచి ముగ్గురు, రన్నరప్ నెదర్లాండ్స్ నుంచి ముగ్గురు, టోర్నీ ఆధ్యాంతం సూపర్‌గా రాణించిన జింబాబ్వే నుంచి ముగ్గురు, సంచలన విజయాలు నమోదు చేసిన స్కాట్లాండ్ నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. ఓపెనర్లుగా పథుమ్ నిస్సంక, విక్రమ్‌జీత్ సింగ్, వన్‌డౌన్‌లో బ్రాండెన్ మెక్‌ముల్లెన్, నాలుగో స్థానంలో సీన్ విలియమ్స్, ఐదో స్థానంలో యువ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్, ఆరో ప్లేస్‌లో సికందర్ రజా, ఏడో స్థానంలో స్కాట్ ఎడ్వర్డ్స్, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా హసరంగ, ఫాస్ట్ బౌలర్లుగా క్రిస్ సోల్, రిచర్డ్ నగరవలను ఎంపిక చేసింది.
ఈ జట్టులో వెస్టిండీస్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (7 మ్యాచ్‌ల్లో 350 పరుగులు, 2 సెంచరీలు), షారు హౌప్ (7 మ్యాచ్‌ల్లో 341 పరుగులు, సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) సత్తా చాటినా, వీరిని సైతం ఐసీసీ విస్మరించింది.










