ఇటీవలి కాలంలో తమ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతున్నదనే భయం అమెరికాను పట్టి పీడిస్తున్నది. అమెరికా ఆయుధ ఉత్పత్తిదారులు నిరంతరం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తత, రక్తపాతాన్ని కోరుకుంటారు. దానికి అనుగుణంగా అమెరికా ప్రభుత్వం పని చేస్తుంది. రానున్న పది సంవత్సరాల్లో పశ్చిమ పసిఫిక్, ఆసియాలో చైనా పెద్దదిగా ఉంటుందని, 2049 నాటికి మొత్తంగా సామర్ధ్యంలో అమెరికా మిలిటరీని అధిగమించనుందని అమెరికా మిలిటరీ జాయింట్ చీఫ్ మార్క్ మిలే చెప్పాడు. చైనాతో పోరును దృష్టిలో వుంచుకొని అమెరికా రక్షణ బడ్జెట్‌ను పెంచుతున్నట్లు రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ చెప్పాడు.
ఇటీవలి వరకు అమెరికా తొత్తుగా ఉన్న హోండూరాస్ ఆదివారం దానితో సంబంధాలను తెగతెంపులు చేసుకొని చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. ఇంతకు ముందున్న ప్రభుత్వం అమెరికా ప్రాపకం కోసం తైవాన్‌ను ఒక దేశంగా గుర్తించింది. ఇప్పుడు అక్కడ వామపక్ష శక్తులు అధికారానికి రావటంతో సీన్ రివర్స్ అయ్యింది. మారుతున్న బలాబలాలకు నిదర్శనంగా 2016 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది దేశాలు తైవాన్‌ను వదలి చైనాతో సంబంధాలు పెట్టుకున్నాయి. హోండూరాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపిన అమెరికా చివరికి చేసేదేమీ లేక మీ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పింది.
ఇటీవలి కాలంలో తమ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతున్నదనే భయం అమెరికాను పట్టి పీడిస్తున్నది. అమెరికా ఆయుధ ఉత్పత్తిదారులు నిరంతరం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తత, రక్తపాతాన్ని కోరుకుంటారు. దానికి అనుగుణంగా అమెరికా ప్రభుత్వం పని చేస్తుంది. రానున్న పది సంవత్సరాల్లో పశ్చిమ పసిఫిక్, ఆసియాలో చైనా పెద్దదిగా ఉంటుందని, 2049 నాటికి మొత్తంగా సామర్ధ్యంలో అమెరికా మిలిటరీని అధిగమించనుందని అమెరికా మిలిటరీ జాయింట్ చీఫ్ మార్క్ మిలే చెప్పాడు. చైనాతో పోరును దృష్టిలో వుంచుకొని అమెరికా రక్షణ బడ్జెట్‌ను పెంచుతున్నట్లు రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ చెప్పాడు. రక్షణ సన్నద్ధతను కొనసాగించేందుకు జో బైడెన్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. దీనితో ప్రతి విభాగాన్ని సంసిద్ధం గావించవచ్చన్నారు. మొత్తం లక్ష కోట్ల డాలర్లను బైడెన్ సర్కార్ సిద్ధం చేసింది. మిలిటరీ ఎత్తుగడల గురించి కూడా మిలే, ఆస్టిన్ వెల్లడించారు. ఆర్థికంగా దిగజారుడును మిలిటరీ హింసాకాండ ద్వారా పూడ్చుకోవచ్చని అమెరికా భావిస్తున్నది. ఏ దేశంలోనూ లేని విధంగా చైనాలో సంపద, వృద్ధి జరుగుతున్నదని, చైనా సంపద ఎంతగా పెరిగితే అంతగా ప్రపంచ శక్తిగా ఎదుగుతుందన్న భయం అమెరికాకు పట్టుకుంది.
సినిమాలు, టీవీ చిత్రాల ద్వారా అమెరికన్లకు ముప్పు ఎలా ఎటువైపు నుంచి వస్తున్నదో చూపటం అక్కడ జరుగుతున్నది. వాటిలో గతంలో రష్యన్లు, ఇతర అమెరికా వ్యతిరేకులను ప్రతినాయకులుగా చూపేవారు. వారి మీద అమెరికన్లలో ద్వేషం పుట్టించేవారు. ఇప్పుడు చైనా, ఇతర దేశాల వారిని కూడా ప్రధానంగా చూపుతున్నారు. దానిలో భాగంగానే ఇటీవల కొన్ని అమెరికా సంస్థలు, పార్లమెంటు లోని రిపబ్లికన్ పార్టీ సభ్యులు కొన్ని ఊహాజనిత యుద్ధ క్రీడలను కంప్యూటర్లలో సృష్టించి జనానికి చూపుతున్నారు. వాటి ప్రకారం 2025 నాటికి తైవాన్ అంశం మీద అమెరికా-చైనా పోరుకు తలపడతాయని, దానిలో చైనా ఓడిపోతుందని చిత్రించారు. ఇది హాలీవుడ్ సినిమా వంటిదే. వాటిలో అమెరికా సిఐఏ గూఢచారులను తెలివిగలవారిగా ఇతర దేశాల వారిని దద్దమ్మలుగా చిత్రిస్తారు. నిజానికి ఇంతవరకు ఏ ఒక్క యుద్ధంలోనూ అమెరికా గెలిచిన ఉదంతం లేదు. అమెరికా రిటైర్డ్ నావీ అధికారి మార్క్ మాంట్‌గోమరీ ఓర్లాండోలో రిపబ్లికన్ ఎంపీలకు చైనాతో పోరు అనే ఒక ఊహా చిత్రాన్ని చూపాడు. దానిలో వేలాది మంది అమెరికన్లు మరణిస్తారని, విమానవాహక నావలను ముంచివేస్తారని చిత్రించాడు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మిలిటరీలో పని చేస్తున్న వారిలో 15 నుంచి 50 మంది లేదా దేశం మొత్తంగా ఐదు నుంచి ఇరవై వేల మంది ఒక వారంలో మరణిస్తారని చూపాడు. దానిలో తైవాన్ రక్షణకు అమెరికా దళాలు చైనా ప్రధాన ప్రాంతంపై ఎలా దాడి చేసేది, దాని నౌకలను ఎలా ముంచేది, మిలిటరీని ఎలా చక్రబంధం చేసేది, వివిధ కోణాల్లో జరిగే పర్యవసానాలను చూపారు. ఇలాంటి వాటిని బూచిగా చూపి అమెరికా తన దుర్మార్గాలకు జనం సమ్మతిని సృష్టించాలని చూస్తున్నది. ఉక్రెయిన్ మాదిరి కాకుండా తైవాన్ ఆక్రమణకు చైనా పూనుకుంటే నేరుగా అమెరికా మిలిటరీని దింపుతారా అన్న ప్రశ్నకు జో బైడెన్ అవును అని సమాధానమిచ్చాడు.
ప్రజాబలం, పట్టుదలలో ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ మిలిటరీ రీత్యా అమెరికాతో 50 సంవత్సరాల నాడు వియత్నాం సరితూగే స్థితిలో లేదు. అయినా బతుకు జీవుడా అంటూ అమెరికా మిలిటరీ ఎలా పారిపోయిందీ ప్రపంచమంతా చూసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిందీ అదే. తాలిబాన్లకు సలాం కొట్టి అమెరికన్లు వెళ్లారు. అలాంటిది చైనాతో ఢకొీనగలమని అమెరికన్లను నమ్మించేందుకు అక్కడి యుద్ధోన్మాదులు చూస్తున్నారు. ''నూతన యుగంలో తైవాన్ సమస్య, చైనా పునరేకీకరణ'' అనే పేరుతో 2022 ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది.
చైనాపై ఒత్తిడి పెంచే పన్నాగంలో భాగంగానే నేడు ఉక్రెయిన్, రేపు తైవాన్ అన్న ప్రచారాన్ని అమెరికా ప్రారంభించింది. దేనికైనా సిద్ధమేనని చైనా కూడా స్పష్టం చేయదలచుకుంది. తాజాగా మిలిటరీకి అందచేసిన వాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. ఉక్రెయిన్ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చాయి. దానికి ప్రతిగానే ఇటీవల జిన్‌పింగ్ మాస్కో వెళ్లి పుతిన్‌తో మరింత గట్టిగా బంధానికి తెరతీశాడు.
ఏడు దశాబ్దాల నాడున్న చైనాకు నేటి చైనాకు ఏ విధంగానూ పోలికే లేదు. ఇరాన్-సౌదీ ఒప్పందాన్ని కుదిర్చి తన పలుకుబడి ఏమిటో ప్రపంచానికి చాటింది. ఇటీవల డేనియల్ ఎల్స్‌బర్గ్ బయటపెట్టిన పెంటగాన్ పత్రాల్లోని వివరాల ప్రకారం 1958లో తైవాన్ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారని, దాన్ని గ్రహించిన అమెరికా వెంటనే తన సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి పంపిందని స్పష్టమౌతోంది. ఒకవేళ మిలిటరీ తైవాన్‌ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ అనుమతి ఇచ్చాడు. తైవాన్ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్‌ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకోవాలని చూసింది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్థికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. 1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణు కార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్ధాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ధ పెట్టింది. ఇప్పుడు ఆ బలహీనతలన్నింటినీ అధిగమించింది. గతంలో ఐసెన్ హోవర్ మాదిరే ఇప్పుడు జో బైడెన్ కూడా ఉక్రెయిన్ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు జిన్‌పింగ్ వెనక్కు తగ్గేందుకు చైనా సిద్ధం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు దీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. అందుకే నిప్పుతో చెలగాటాలు ఆడవద్దని బైడెన్‌తో భేటీలో జిన్‌పింగ్ హెచ్చరించగలిగాడు.
ఎం.కె.ఆర్










