Apr 30,2023 08:27
  • కర్ణాటకలో కాంగ్రెస్‌కు 132-140 సీట్లు
  • కమలానికి 57-65 సీట్లు
  • ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడి

న్యూఢిల్లీ : రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకువెళుతుందని, బిజెపి అత్యంత అధ్వానమైన పనితీరును కనబరుస్తుందని ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కన్నడ సంస్థ ఎదినా ఈ సర్వేను నిర్వహించింది. 113 సీట్లకు పైగానే కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశం వుందని తెలుస్తోంది. మే 10న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది. 43శాతం ఓట్లతో కాంగ్రెస్‌ 132-140 సీట్లను గెలుచుకుంటుందని సర్వేలో అభిప్రాయం వ్యక్తమైంది. అదే గనుక నిజమైతే గత మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే అవుతుందని భావిస్తున్నారు. 33శాతం ఓట్లతో బిజెపి 57 నుండి 65 సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 104సీట్లు గెలుచుకుంది. ఇక్కడ రెండు ముఖ్య విషయాలను గుర్తించాల్సి వుంది. మొదటిది, బిజెపి ఎన్నడూ కూడా రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ సంపాదించుకోలేదు. కాంగ్రెస్‌ ఎప్పుడూ మెరుగైన ఓటు వాటాను గెలుచుకుంటోంది. రెండోది, 2019లో ఎన్నికలు జరిగిన 14మాసాల తర్వాత కాంగ్రెస్‌-జనతాదళ్‌ (సెక్యులర్‌) ప్రభుత్వాన్ని కూలదోసి, ఆ పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించి, వివాదాస్పద పరిస్థితుల్లో బిజెపి అధికారంలోకి వచ్చింది. 2013లో బిజెపి చీలిపోయినప్పుడు మినహా గత రెండు దశాబ్దాల్లో అత్యంత అధ్వానమైన పనితీరును కనబరిచింది. జెడి(ఎస్‌)కు కూడా అదే పరిస్థితి ఎదురుకావచ్చునని సర్వే పేర్కొంది.

 

Against-the-BJP


 

                                        అవినీతి, అసమర్థతే బిజెపిని ఓడించనున్నాయి : సర్వే కో-ఆర్డినేటర్‌

ఈ ఒపీనియన్‌ పోల్స్‌ నిజమైనట్లైతే, అవినీతి, అసమర్ధత అనేవి బిజెపిని పారద్రోలడానికి ప్రధాన కారణాలుగా వున్నాయనేది స్పష్టమైందని ఎదినా సర్వే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వాసు హెచ్‌వి ది వైర్‌తో వ్యాఖ్యానించారు. అదే సమయంలో మరోకోణం కూడా వుంది. కర్ణాటకలో అణచివేతక గురైన వర్గాలు అంటే దళితులు, బిసిలు కొంత కాలం నుంచి కాంగ్రెస్‌కు మరింత అనుకూలంగా వున్నారు. పేదలు మరింతమంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేస్తున్నారు. ధరల పెరుగుదల, ఇతర సమస్యలు, గత మూడు నాలుగేళ్లలో ఆర్థిక క్షీణత, కోవిడ్‌ అనంతర పరిణామాలు, ఈ కారణాలన్నీ ఈ ఓపీనియన్‌ పోల్‌లో వ్యక్తమవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయన్నారు.
        రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ, సంపన్నుల నుండి పేదల వరకు చూసినట్లైతే కాంగ్రెస్‌ ఓటు శాతం పిరమిడ్‌ తరహాలో పెరుగుతూ వస్తోంది. అదే బిజెపి విషయంలో అయితే, ఈ పిరమిడ్‌ తలకిందులవుతోంది. సమాజంలోని నిరుపేద వర్గాల వరకు వెళ్లినట్లైతే బిజెపికి ఓట్లు శూన్యమని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కులమొక్కటే చర్చిందగ్గ విషయం కాదని అంటూ ప్రతి కులంలోనూ సంపన్నులు, పేదల మధ్య తేడా వుటుంది. ఉదాహరణకు లింగాయత్‌ల్లో నిరుపేదలు కాంగ్రెస్‌ వైపు వుంటుండగా, అగ్రవర్ణాల్లో కూడా అదే పరిస్థితి. మరోవైపు దళితులు, ముస్లిముల్లో సంపన్నులైన దళితులు, ముస్లిమ్‌లు బిజెపి వైపునకు మళ్లుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో సంపన్నలు, పేదలు అన్న అంశం బాగా పనికివస్తోందని, అందుకే కాంగ్రెస్‌ నిరుపేదలు లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతోందని తెలిపారు.
 

                                                                బరిలో 2,613 మంది అభ్యర్థులు

మే 10న ఎన్నికలు జరగనున్న 224 స్థానాలకు మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. 224 మంది బిజెపి, 223 మంది కాంగ్రెస్‌, 207 మంది జెడి(ఎస్‌), 209 మంది ఆప్‌, 133 మంది బిఎస్‌పి, నలుగురు సిపిఎం, ఎనిమిదిమంది జెడి(యూ), ఇద్దరు ఎన్‌పిపి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 685 మంది రిజిస్టర్డ్‌ అన్‌ రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌ పార్టీలకు(ఆర్‌యుపిపి) చెందిన వారు కాగా, 918 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.