తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో దర్శకులు, నటుల కుమారులు నట వారసులుగా తెరంగేట్రం చేశారు. వీరిలో అనేక మంది విజయవంతంగా దూసుకెళ్లిన వారూ ఉన్నారు. ఆ కోవలోకి చెందిన వారే దర్శకుడు ఎం.ఎస్.రాజు కొడుకు సుమంత్ అశ్విన్. 'తూనీగ.. తూనీగ' చిత్రంతో 2012లో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మొదటి ప్రయత్నం విఫలమైనా, రెండో ప్రయత్నంతో వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు. తాజాగా '7 డేస్ 6 నైట్స్'అనే చిత్రంతో జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో సుమత్ అశ్విన్ గురించి మరిన్ని విశేషాలు..
సుమంత్ అశ్విన్ తెలుగు చలనచిత్ర నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత అయిన ఎం.ఎస్. రాజు కొడుకు. తన తండ్రి దర్శకత్వంలో 2012లో విడుదలైన 'తూనీగ తూనీగ' చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత కేరింత, కొలంబస్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన 'అంతకుముందు.. ఆ తర్వాత' రెండో చిత్రంతో మంచి విజయం సాధించారు. తాజాగా ఆయన నటించిన '7 డేస్.. 6 నైట్స్' చిత్రం గురించి మాట్లాడుతూ.. 'కొన్ని సినిమాలు పూర్తయ్యాక కానీ వాటి పేరు విషయంలో స్పష్టత రాదు. ఈ సినిమాకి కథతో పాటే పేరు పుట్టింది. స్వతహాగా నాకు ప్రయాణాలంటే ఇష్టం. రకరకాల ప్రదేశాలు తిరిగొస్తుంటా. విహారయాత్రలకి వెళ్లినప్పుడు ఇన్ని రోజులు, ఇన్ని రాత్రులు అంటూ ప్యాకేజ్ మాట్లాడుకుంటాం కదా. ఈ పేరు చెప్పగానే అదే గుర్తుకొచ్చింది. ఏడు రోజుల్లో పూర్తయ్యే కథ ఇది'.
'ఈ సినిమా చాలా హాయిగా సాగే ఓ సింపుల్ కథ. ఒక పక్క వినోదం పంచుతూనే మరోపక్క ఓ అందమైన కథని చెబుతుంటుంది. సినీ దర్శకుడు కావాలని పరితపించే పాత్ర అది. జీవితంలో ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. తన గురించి తాను శ్రద్ధ తీసుకోకుండా లక్ష్యం గురించి ఆలోచించే ఆ యువకుడి జీవితంలో ఏం జరిగిందో తెరపైనే చూడాలి. నాతోపాటే హీరోగా కనిపించే రోహన్ పాత్ర బాగుంటుంది. కథానాయిక మెహర్ గుర్తుండిపోయేలా నటించారు' అని చెప్పుకొచ్చారు.
వాస్తవిక కథలు చేయాలి..
'నా కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. చాలా వేగంగా ఈ పదేళ్లు గడిచిపోయాయి. విజయాలు, పరాజయాలతో కూడిన ఓ అందమైన ప్రయాణం ఇది. కొత్త నిర్ణయాలు అంటే ఆల్రెడీ చేసిన క్యారెక్టర్స్ కాకుండా కొత్త రోల్స్, రిలేటబుల్ రోల్స్ చేయాలని ఉంది. ఇప్పుడు ప్రేక్షకులూ డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనమూ నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు ఉన్నాయి. ఇక నుంచి వాస్తవానికి దగ్గరగా ఉండే కథ, పాత్రలు చేయాలి. ప్రస్తుతం 'సతి' అనే సినిమా చేస్తున్నా. 'దృశ్యం' తరహాలో భార్యాభర్తల నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన కథ అది.'
వాళ్లలా చేయలేనని అనుకున్నా..
చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. అప్పుడు వెంకటేష్ గారు, ప్రభాస్ గారు, మహేష్‌బాబు గారిని చూస్తే ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. డ్యాన్సులు చేసేవారు. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్లను చూసి అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ కావాలనుకున్నా. 'వర్షం' సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయమయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అప్పుడు వెయిట్ తగ్గా. మా సినిమాల్లో హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ టైమ్‌లో వెళితే నా ఫోటోలు కొన్ని తీశారు. అవి త్రివిక్రమ్ గారు, ప్రభుదేవా గారు చూసి 'చాలా బావున్నాడు. బాడీబిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు' అని చెప్పారు. నా మనసులో అది ఉండిపోయింది. దాంతో ముంబై వెళ్లి, యాక్టింగ్ కోర్స్ చేశా. అప్పుడే హీరో కావాలనుకున్నా.
చీప్‌గా ఉంటే.. చూడలేం..
మంచి కథ ఉంటే ఏ తరహా సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు. ఈ ట్రైలర్, టైటిల్ చూసి బోల్డ్ కంటెంట్ ఉంటుందని అనుకుంటున్నారు. కానీ బలమైన కథ చెబుతున్నాం. కొందరు స్నేహితులు బ్యాచలర్ ట్రిప్‌కు వెళ్తే.. అక్కడ వారికి ఎదురైన ఆసక్తికర ఘటనల నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. నేను కాపీ చూసినప్పుడు నాతో పాటు మా అమ్మ, సిస్టర్ కూడా ఉన్నారు. మా ఇంట్లో సినిమా అని కాదు.. చీప్‌గా ఉంటే వాళ్లతో కలిసి చూడలేం. ఇబ్బందిపడే సన్నివేశాలు ఉండవు. నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్‌లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు.
పేరు : సుమంత్ అశ్విన్
పుట్టిన తేదీ : 1988, జూన్ 30
పుట్టిన ప్రాంతం : హైదరాబాద్
చదువు : గ్రాడ్యుయేషన్
జీవిత భాగస్వామి : దీపిక
తల్లిదండ్రులు : ఎంఎస్.రాజు
తోబుట్టువులు : రిషిత