ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివేకా హత్యకేసులో భాగంగా ఎంపి అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే? ఏ తప్పూ చేయని చంద్రబాబును జైల్లో పెట్టినా సంయమనంతో వ్యవహరిస్తున్నామని టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో కలిసి టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ అవినీతికి సహకరించి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు జైలుకెళ్లారని అన్నారు. చంద్రబాబు విషయంలో తప్పుచేసిన అధికారులకు టిడిపి ప్రభుత్వం రాగానే దండన ఉంటుందన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ముడిపడిన అనేక ప్రధాన అంశాలను పక్కనపెట్టి కేవలం ఎవరో ఒక అధికారి నోట్‌ఫైల్లో రాసిన దానిని పట్టుకుని చంద్రబాబును అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇదే పద్ధతి భవిష్యత్‌లో వచ్చే ప్రభుత్వాలు అనుసరిస్తే జగన్, అతని కేబినెట్ సభ్యులు జీవితాంతం జైల్లో ఉండక తప్పదని హెచ్చరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు అప్పటి విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న నీలం సహాని, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డి, అజరు కల్లంను విచారించకుండా చంద్రబాబే బాధ్యులని చెప్పడం ముమ్మాటికీ కక్షసాధింపే అని విమర్శించారు. వోక్స్‌వ్యాగన్ వ్యవహారంలో రూ.13 కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన బొత్స సత్యనారాయణ... చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటని జగదీష్ విమర్శించారు.
చంద్రబాబును శాశ్వతంగా జైల్లోనే ఉంచాలని పాలకుల కుట్రలు నెరవేరవని మాజీ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. సిఐడి వాస్తవాలను కోర్టుల ముందు పెట్టకుండా ఎందుకు దుష్ప్రచారం చేస్తోందని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక కాలం కోర్టు బెయిల్‌పై జీవిస్తున్న వ్యక్తిగా సిఎం జగన్ సరికొత్త రికార్డు నెలకొల్పారని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఎద్దేవా చేశారు. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్ జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీ, ఇసుక కుంభకోణంపై ఆశ్రయించే దమ్మూ, ధైర్యం ఉన్నాయా? అని టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్‌ప్రసాద్ ప్రశ్నించారు.










