Nov 20,2023 18:57
  • 'ఆదికేశవ' థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల

పంజా వైష్ణవ్‌ తేజ్‌ మెగా కుటుంబం నుండి వచ్చినప్పటికీ, అరంగేట్రం కోసం 'ఉప్పెన' వంటి విభిన్న చిత్రాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌, పూర్తి మాస్‌ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ యూత్‌ ఫుల్‌ చిత్రం 'ఆదికేశవ'తో రాబోతున్నారు. ఇటీవల విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం 'మ్యాడ్‌'లో నటుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను నవంబర్‌ 20న సాయంత్రం హైదరాబాద్‌ లోని ఏఎంబి మాల్‌ లో జరిగిన వేడుకలో విడుదల చేశారు.


ఈ సందర్భంగా కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ, ''ట్రైలర్‌ కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మెచ్చే సినిమాని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్‌ మాదిరిగానే సినిమా కూడా మీ అందరినీ మెప్పిస్తుంది'' అన్నారు. అలాగే ''నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది'' అంటూ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ ని చెప్పి మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు వైష్ణవ్‌.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ''ఇదొక పక్కా మాస్‌ సినిమా. ఇందులో యాక్షన్‌, ఎమోషన్‌, కామెడీ, సాంగ్స్‌ అన్నీ బాగుంటాయి. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత ఈ ఏడాది వస్తున్న పర్ఫెక్ట్‌ మాస్‌ ఫిల్మ్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది.'' అన్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్‌ కుమార్‌ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. రాధిక వంటి సీనియర్‌ నటులు, సుదర్శన్‌, మలయాళ నటుడు జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఆదికేశవ చిత్రాన్ని 2023 నవంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.