Sep 20,2023 10:53

హైదరాబాద్‌ : తెలుగు సినిమా అగ్రనటుడు, నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు నేడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమయ్యాయి. ఇందుకుగాను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఏఎన్నార్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ... అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు సందడి చేస్తున్నాయి. నటీనటులు, అభిమానులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలను షేర్‌ చేస్తూ నాగేశ్వరరావును స్మరించుకుంటున్నారు.

                                                              #ANRLiveson : మెగాస్టార్‌ చిరంజీవి

'' అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన వందలాది చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. తెలుగు సినిమా బతికినంత వరకు నాగేశ్వరరావు ప్రేక్షకుల మనుసుల్లో నిలిచి ఉంటారు. ఆ మహానుభావుడి శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి, నా సోదరుడు నాగార్జునకు.. అలాగే నాగేశ్వరరావును అభిమానించే కోట్లాదిమంది సినీ ప్రేమికులకు నా హఅదయ పూర్వక శుభాకాంక్షలు '' అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి #ANRLiveson అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.