Oct 15,2023 07:41

మోపాల్‌ (నిజామాబాద్‌) : దసరా సెలవులకు సంతోషంగా ఇంటికొచ్చిన కుమార్తె గుండెపోటుతో మరణించడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. కంజర గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సాయిలక్ష్మికి గ్రెసీ, మైథిలి ఇద్దరు కుమార్తెలున్నారు. సాంఘిక సంక్షేమ గురుకులంలోనే గ్రెసీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మైథిలి (12) ఏడో తరగతి చదువుతున్నారు. దసరా సెలవు కావడంతో ఇద్దరూ శుక్రవారం ఇంటికి వచ్చారు. సాయంత్రం వరకు ఉత్సాహంగా కనిపించిన మైథిలి రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిందని డాక్టరు తెలిపారు. శనివారం గ్రామంలో బాలిక అంత్యక్రియలు నిర్వహించగా.. తోటి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు తెలిపారు.