యజమానులెవరో తెలుసా?
ప్రజాశక్తి - కొల్‌కతా : ఫుల్దంగాలోని 'అపా' అనే గార్డెన్ హౌస్ ఉద్యానవనంతో, చక్కటి సౌకర్యాలతో, విశాలమైన స్థలంలో నిర్మించబడింది. ఆ ఇంటి అసలు యజమాని ఎవరో తెలుసా? బయటవారికి తెలియకున్నా ఈ ప్రాంత ప్రజలకు చాలా సంవత్సరాలుగా తెలుసు . ఈసారి ఆ ఇంటి పత్రాలు బయటపడ్డాయి. చాలా కాలంగా ప్రజలు అనుకుంటున్నదే సరైనదని ఆ పత్రం తెలియజేసింది . ఎస్‌ఎస్‌సి స్కాంలో ఇటీవల అరెస్టయిన రాష్ట్ర మాజీ మంత్రి పార్థ ఛటర్జీ , అతని స్నేహితురాలు అర్పితా ముఖర్జీలకు చెందినదే ఈ 'అపా' గార్డెన్ హౌస్. దీనికి వీరిద్దరూ యజమానులు. అందుకే ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలను కలిపి ఆ ఇంటికి 'అపా' అని పేరు పెట్టారు.
భూ శాఖ రికార్డుల ప్రకారం , బోల్పూర్ శంబాతి మౌజా లో విశాలమైన భూ భాగంలో 'అపా'. గార్డెన్ హౌస్‌ను నిర్మించారు. ఇది పది అంతస్థుల భవనం ఒక్కో అంతస్తులో వెయ్యి చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మాణాలు. శ్యామలీ బెనర్జీ , సుషీమ్ బెనర్జీ అనే దంపతుల నుంచి ఈ ఆస్తిని వారు కొనుగోలు చేశారు. ఈ ఆస్తి మార్పిడి 2012లోనే జరిగింది. .ఆనాడు ఇరవై లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన ఈ ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చూసినా కనీసం మూడు రెట్లు. అధికం. కానీ పార్థ-అర్పితలకు బోల్పూర్, శాంతినికేతన్‌లలో కూడా ఆస్తులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా దర్యాప్తు సంస్థ చేతికి చిక్కినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనాజురి హట్ వెనుక చాలా విలువైన ప్లాట్ యజమాని పార్థ ఛటర్జీనే. ఈయనకు శాంతినికేతన్-బోల్పూర్ ప్రాంతంలో గార్డెన్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు , ఫ్లాట్‌లు అనేకం ఉన్నాయి. పార్థ-అర్పిత పేరుతో ఉమ్మడి ఆస్తులే కాదు, ఇద్దరికీ విడివిడిగా కూడా అనేక ఆస్తులు ఉన్నాయి. బోల్పూర్ చత్తర్‌లో అర్పితా ముఖర్జీ పేరు మీద నాలుగు ప్లాట్లు కూడా ఉన్నాయి . బోల్‌పూర్‌లోని గోల్‌పరా మీదుగా సర్పుర్‌కుర్‌దంగా వద్ద నిర్మిస్తున్న లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి ఇటీవల కొత్త సమాచారం బయటకు వచ్చింది. యాజమాన్య పత్రాల్లో పార్థ ఛటర్జీ పేరు ఎక్కడా లేదు. ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ చరిత్ర తెలిసిన పలువురు పార్థ ఛటర్జీ డబ్బును కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉపయోగించారని స్పష్టం చేశారు.










