ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాత పెన్షన్ విధానం (ఒపిఎస్) సాధన కోసం ఈ నెల 25న చలో కలెక్టరేట్ నిర్వహించాలని ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌ఇఎ ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఫ్యాప్టో ఛైర్మన్ ఎన్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ చెన్నుపాటి మంజుల, ఎపిసిపిఎస్‌ఇఎ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అప్పలరాజు, కె రాజేశ్వరరావు గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానమే కావాలని నినదిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదని పేర్కొన్నారు. తను అనుకున్న విధంగా గ్యారంటీ పెన్షన్ స్కీం (జిపిఎస్)ను ఉపాధ్యాయ, ఉద్యోగులపై మొండిగా రుద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం పొందిందని అన్నారు. జిపిఎస్‌ను ప్రతిఘటించేందుకు ఈ నెల 25న చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చామని వివరించారు. దీంతోపాటు ఈ నెల 22న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం, 23 సాయంత్రం పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాలను జిపిఎస్‌ను వ్యతిరేకించే అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు.










