Apr 15,2023 07:37

డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఆగస్టులో జరిగే బ్రిక్స్‌ సమావేశంలో లోకల్‌ కరెన్సీ వినియోగం గురించి చర్చిస్తామని ఇప్పటికే ప్రకటించారు. క్రమంగా కార్యరూపం దాల్చుతున్న డీడాలరైజేషన్‌ (డాలర్‌తో పనిలేదు) నినాదం అమెరికా ఆధిపత్యానికి గట్టి సవాల్‌ విసురుతోంది. డాలర్‌ను సాధనంగా చేసుకుని ఇన్నాళ్ల్లూ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తూ వచ్చిన అమెరికాకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గడ్డు పరిస్థితి తప్పదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

         రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతుండగానే ఇండియాకి ఆయిల్‌ ఎగుమతులు కొనసాగుతున్నాయి. అది కూడా రూపాయిల్లోనే మారకం జరుగుతోంది. భారత్‌-రష్యా వాణిజ్యం రూపాయిల్లోకి మారడమే కాదు. తాజాగా మలేషియా తోనూ భారత వాణిజ్యం రూపాయిల్లోకి మళ్లుతోంది. ఇప్పటికే 13 దేశాలతో భారతీయ రూపాయిల్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఒక్క ఇండియా మాత్రమే కాదు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు మారకద్రవ్యం కోసం రిజర్వు కరెన్సీగా డాలర్ల ప్రాధాన్యత తగ్గించేస్తున్నాయి. ఇతర రూపాల్లో వాణిజ్యం ప్రారంభించాయి. రష్యా-చైనా, రష్యా-ఇరాన్‌ మధ్య వాణిజ్యం రష్యన్‌ రూబుళ్లలో మొదలై ప్రస్తుతం చైనీస్‌ యువాన్ల వైపు సాగుతోంది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలతో తమ వాణిజ్యం రూబుళ్లతో పాటుగా యువాన్లలో ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించాడు. తాజాగా యూఏఈ కి చెందిన ఆయిల్‌ కంపెనీతో పాటుగా ఫ్రాన్స్‌ ఆయిల్‌ దిగ్గజ సంస్థలతోనూ చైనా తన కరెన్సీ లోనే మారకం జరిగేలా ఒప్పందం కుదర్చుకుంది. దాంతో డాలర్‌ భవిష్యత్‌ డోలాయమానంలో పడుతోంది. రష్యా, చైనా, ఇరాన్‌, బ్రెజిల్‌, కెన్యా, సౌదీ అరేబియా, యూఏఈ లతో పాటుగా ఆసియన్‌ దేశాలు కూడా ప్రత్యామ్నాయ కరెన్సీని ఆశ్రయిస్తున్నాయి. డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఆగస్టులో జరిగే బ్రిక్స్‌ సమావేశంలో లోకల్‌ కరెన్సీ వినియోగం గురించి చర్చిస్తామని ఇప్పటికే ప్రకటించారు. క్రమంగా కార్యరూపం దాల్చుతున్న డీడాలరైజేషన్‌ (డాలర్‌తో పనిలేదు) నినాదం అమెరికా ఆధిపత్యానికి గట్టి సవాల్‌ విసురుతోంది. డాలర్‌ను సాధనంగా చేసుకుని ఇన్నాళ్ల్లూ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తూ వచ్చిన అమెరికాకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గడ్డు పరిస్థితి తప్పదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
           రెండో ప్రపంచయుద్ధం అనంతరం అప్పటికే దెబ్బతిన్న యూరప్‌ దేశాలతో పాటు...కొత్తగా స్వాతంత్య్రం సాధించిన మూడో ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం...అమెరికా వేసిన ఎత్తుల్లో భాగంగా డాలర్‌ ప్రపంచ మారకరూపం దాల్చింది. తన పెత్తనాన్ని సహించని దేశాల మీద ఆంక్షలు విధించి అణచివేయడానికి లేదా తన దారికి తెచ్చుకోవడానికి కూడా డాలర్‌ ని వాడుకుంది.
 

                                                                        అడ్డగోలు ఆంక్షలతో...

అమెరికా పెత్తనాన్ని సహించని ప్రభుత్వాలను అన్ని విధాలుగా అణిచేసే క్రమంలో డాలర్‌ కూడా ఓ ఆయుధమైంది. వివిధ దేశాల్లో సార్వభౌమత్వం కోసం నిలబడిన నేతలను, వారి ప్రభుత్వాలను వేధించేందుకు అమెరికన్‌ డాలర్లనూ వినియోగించింది. ఆయా దేశాల మీద ఆంక్షలు విధించి, డాలర్లు అందుబాటులో లేకుండా చేసి, వారిని తన దారికి తెచ్చుకునే యత్నాలు యథేచ్ఛగా సాగించింది. ఆ క్రమంలో మిలియన్ల కొద్దీ సామాన్యులు అత్యవసర సరుకులు కూడా అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నా తన పాశవికతను ప్రదర్శిస్తూనే వచ్చింది. నేటికీ వెనిజులా, ఇరాన్‌, సిరియా, జింబాబ్వే వంటి దేశాల మీద అమెరికా ఆంక్షల కారణంగా పిల్లలకు పాలు, ఇతర ఆహార పదార్థాలు కూడా లభించని స్థితిలో లక్షలాది మంది ఇక్కట్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. తన దేశానికి చెందిన కరెన్సీని ప్రపంచ మార్కెట్‌ మూలాధారంగా మార్చేసి, ఆర్థిక ఆధిపత్యం చెక్కుచెదరకుండా చేసుకుంది. అంతకు ముందు క్యూబాని దిగ్బంధించి ఎంతగా వేధించిందో ప్రపంచానికి తెలుసు. అమెరికన్‌ ఆంక్షల కారణంగా నేటికీ క్యూబన్లకు ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.
          అమెరికా ఆర్థిక, రాజకీయ లక్ష్యాల సాధన కోసం డాలర్‌ ఓ ముడిసరుకు అయ్యింది. అమెరికా ఆంక్షల వల్ల ఇక్కట్లు ఎదుర్కొన్న ఆయా దేశాల్లో ప్రజలు తిరుగుబాట్లు ప్రోత్సహించడం, తమ తొత్తు ప్రభుత్వాలను అక్కడ నెలకొల్పి ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్య్రాన్ని హరించడమే లక్ష్యంగా సాగుతోంది. అమెరికా కుయుక్తుల సాధనలో డాలర్‌ విస్తృత పాత్ర పోషించింది.
 

                                                                        రష్యా మీద ఆంక్షలతో...

అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే శక్తులపై ఆంక్షలు విధించడం విస్తృతమవుతోంది. 1990లో పోలిస్తే 2021 నాటికి 933 శాతం మేర ఈ ఆంక్షల పరిధి పెరిగింది. ఉక్రెయిన్‌ పరిణామాలను సాకుగా చూపించి రష్యాని దిగ్బంధించాలని అమెరికా ఎత్తులు వేసింది. ఆర్థికంగా రష్యాని కట్టడి చేసేందుకు గాను ఆంక్షల పర్వానికి తెరలేపింది. రష్యా నుంచి గ్యాస్‌, చమురు దిగుమతులు చేసుకోకుండా ఈయూ దేశాలను నియంత్రించింది. అయినా అమెరికా ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి ఇప్పుడు బెంబేలెత్తిపోతోంది. అందుకు ప్రధాన కారణం అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా తన దారి తాను చూసుకుంది. చివరకు అదే ఇప్పుడు అమెరికా ఆధిపత్యానికి సవాల్‌ అవుతోంది. డాలర్లకి బదులుగా వివిధ కరెన్సీల్లో తన ఎగుమతులకు ఆటంకం లేకుండా చూసుకునేందుకు రష్యా సిద్ధం కావడం అమెరికాకి ఛాలెంజ్‌గా మారింది. ఇప్పటికే ఇండియాకి రష్యా ఆయిల్‌ ఎగుమతులు పెరిగాయి. అది కూడా రూపాయిల్లోనే మారకం చేసుకునేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతుల ధరల మీద కూడా అమెరికా ఆంక్షలున్నాయి. ఆ పరిధి మేరకు రష్యా చమురును చౌకగా అది కూడా రూపాయిల్లోనే కొనుగోలు చేస్తున్నప్పటికీ భారతీయులకు మాత్రం ధరల్లో ఊరట లేదు. అదే సమయంలో రష్యన్‌ ఆయిల్‌ని వివిధ దేశాలకు అమ్ముకుంటూ భారతీయ కంపెనీలు, ప్రభుత్వం కూడా భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి.
       కేవలం ఇండియాతో సరిపెట్టకుండా తన ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా ఇరాన్‌, చైనా సహా అనేక దేశాలతో ఆయా స్థానిక కరెన్సీలను రష్యా అనుమతిస్తోంది. తాజాగా చైనీస్‌ కరెన్సీ యువాన్లలో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యానికి వాడబోతున్నట్టు ప్రకటించింది. ఇది డాలర్‌ కి అతి పెద్ద దెబ్బ. ఐఎంఎఫ్‌ లెక్కల ప్రకారం 1990ల నాటికి ప్రపంచ వాణిజ్యం 87 శాతం అమెరికన్‌ డాలర్లలో జరిగేది. ప్రస్తుతం అది 65 శాతానికి పడిపోయింది. మరోవైపు ఫారిన్‌ రిజర్వు కరెన్సీగా డాలర్‌ స్థానంలో బంగారం, ఇతర ప్రత్యామ్నాయాల వైపు దేశాలు అడుగులు వేస్తున్నాయి. దాంతో మారక ద్రవ్య నిల్వల్లో 1970ల నాటికి 72 శాతం డాలర్‌ ఉంటే, 2021 నాటికి అది 59 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం మరింత పడిపోయి 50 శాతం లోపు ఉంటుందని అంచనా.
 

                                                                    బహుళధృవ ప్రపంచం దిశగా...

ఏకధృవ ప్రపంచంలో తనకు తిరుగులేదని గడిచిన మూడు దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న అమెరికాకి ఈ పరిణామాలు అతి పెద్ద సమస్యగా మారబోతున్నాయి. త్వరలోనే బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా) సమావేశం జరగబోతోంది. ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం ప్రయత్నిస్తున్నామని ఇండియా మినహా మిగిలిన దేశాధినేతలంతా ప్రకటిస్తున్నారు. షాంఘై కేంద్రంగా బ్రిక్స్‌ న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అధినేతగా బ్రెజిల్‌ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ బాధ్యతలు స్వీకరించారు. చైనాతో వాణిజ్యానికి ప్రపంచంలోనే అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. డాలర్‌ పెత్తనానికి ముగింపు పలికి బహుముఖ ప్రపంచం దిశగా ఈ పరిణామాలు సాగుతున్నాయి. అమెరికాతో సంబంధం లేకుండా ఇప్పటి వరకూ ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో కూడా డాలర్‌ ని వినియోగించాల్సి ఉండేది. కానీ ఇకపై అలాంటి అవసరం లేదంటూ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు.
           అమెరికన్‌ కరెన్సీని ప్రపంచమంతా అంగీకరించాల్సిన స్థితి నుంచి ప్రధాన దేశాల కరెన్సీలకు సైతం మారకం విలువ దక్కడం ఆర్థిక, రాజకీయ రంగాల్లో కీలక మార్పులకు దారితీస్తుంది. జియో పాలిటిక్స్‌ లో కీలక పరిణామాలకు మూలం అవుతుంది. ఇప్పటికే అమెరికన్‌ ఆర్థిక రంగంలో ఈ పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. అక్కడి రాజకీయాలను సైతం కదిలుస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సైతం అమెరికా ఆధిపత్యానికి ప్రమాదం ముంచుకొచ్చిందని బహిరంగంగానే వాపోవాల్సి వచ్చింది. అమెరికాను ఖాతరు చేయాల్సిన అవసరం లేకుండా పోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ బిక్కుబిక్కుమంటుంటే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశానికి పెను సవాళ్లు ఎదురవుతున్న స్థితిని ట్రంప్‌ మాటలు చాటుతున్నాయి. దాంతో ఈ వ్యవహారాలు డాలర్‌ ఆధిపత్యానికి పూర్తిగా గండికొట్టగలిగితే రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఉన్న అమెరికా ఆధిపత్యం కోల్పోతుంది. ఇది గడిచిన దశాబ్దాల్లో ఊహించనిది. అమెరికా సైతం ఎన్నడూ తలచనిది. అందుకే అది అంత సులువుగా తన పెత్తనం వదులుకోవాడానికి సిద్ధంగా లేదనే సంకేతాలు తాజాగా ఫిన్లాండ్‌ని నాటోలో చేర్చుకోవడం ద్వారా పంపిస్తోంది. ఇటు దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌ కేంద్రంగా కొత్తగా సైనిక దళాల మోహరింపు ద్వారా చెబుతోంది. దాంతో ఇదంతా కీలక దశకు చేరినట్టు భావించాల్సి ఉంటుంది.

అమన్‌