ప్రజాశక్తి-బాపట్ల : చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటుపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌్ వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని పాండురంగాపురం సముద్రతీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. దీనిపై నరేంద్రవర్మతోపాటు మరో 14 మంది టిడిపి నేతలు, కళాకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఎస్‌ఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో 30 సెక్షన్ అమలులో ఉన్నందున సైకత శిల్పం ఏర్పాటు చేసినందుకు టిడిపి నేతలపై 188, 143, ఆర్/డబ్య్లూ149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
సిపిఎం ఖండన
చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటు చేశారని కొంతమంది కళాకారులపై బాపట్ల పోలీసులు కేసులు పెట్టడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ చర్య భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేసే నిరంకుశ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వెంటనే కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.










