ప్రజాశక్తి - వినుకొండ (పల్నాడు జిల్లా) : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి సమీపంలోని మార్కాపురం రోడ్డు పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శావల్యాపురం ముండ్రువారిపాలేనికి చెందిన కొమ్మతోటి నవీన్ (24), కనమలపూడికి చెందిన యెహోషువా (22) ఇద్దరూ కలిసి శుభాకార్యాల్లో ఆర్కెస్ట్రా ఈవెంట్లు చేస్తుంటారు. నవీన్ స్నేహితుడైన ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన రాజాల శివారెడ్డి (21) వినుకొండ పట్టణంలో రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. శివారెడ్డికి పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అన్వేష్, ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన మహేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రకాశం జిల్లా కుంట వద్ద ఓ ఈవెంట్‌కు నవీన్, యెహోషువా వెళ్తూ శివారెడ్డిని పిలిచారు. శివారెడ్డి అతని స్నేహితులైన అన్వేష్, మహేష్‌ను పిలిచారు. అందరూ కలిసి కారులో వెళ్లారు. ఈవెంట్ ముగిసిన అనంతరం వినుకొండకు తిరిగి వస్తుండగా సోమవారం తెల్లవారుజామున కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి పై పసుపులేరు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సంఘం పాల డెయిరీ లారీ ఢీకొట్టింది. నవీన్, శివారెడ్డి, యెహోషువా అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.











