ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 1998 డిఎస్‌సిలో అన్యాయం జరిగిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలు కల్పించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద 1998 డిఎస్‌సి మిగిలిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను లక్ష్మణరావు బుధవారం ప్రారంభించారు. ఈ సంద్భరంగా ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్ల నిరీక్షణ అనంతరం అందరికీ ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులు అశపడ్డారన్నారు. 2022 జులైలో ఉద్యోగం చేయడానికి ఇష్టం ఉన్న అభ్యర్థులు తమ విల్లింగ్ తెలియజేయాలని ప్రభుత్వం కోరిన మేరకు 6,754 మంది ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేయించుకున్నారని తెలిపారు. వీరందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి 4,072 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఇందులో రూల్ ఆఫ్ రిజరేషన్లు పాటించకపోవడంతో ఎస్‌సి, బిసి, వికలాంగులు, మహిళా అభ్యర్థులు 2,326 మందికి అన్యాయం జరిగిందన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థులకు అన్యాయం చేశారన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ.. మిగిలిపోయిన అభ్యర్థులు ఉద్యోగాలు రాకపోవడంతో దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాట కమిటీ అధ్యక్షులు జి మోహనరావు మాట్లాడుతూ.. అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరాహార దీక్షలో నాయకులు పి రమేష్, మేరీ, సుహాసిని, సరస్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










