Mar 04,2023 19:33

మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఎపిజెఎసి అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-కడప అర్బన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల హక్కులు, హామీల అమలు కోసం ఈ నెల 9వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఉద్యమబాట పడుతున్నట్లు ఎపిజెఎసి అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమ ముందడుగులో భాగంగా శనివారం కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. అనంరతం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 9, 10వ తేదీలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు. 13, 14వ తేదీలలో కలెక్టరేట్ల ఎదుట భోజన విరామ సమయంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. 15, 17, 20వ తేదీలలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు ఉంటాయని పేర్కొన్నారు. 21వ తేదీ సెల్‌ డౌన్‌ పేరుతో ప్రభుత్వ యాప్‌లను పనిచేయకుండా నిలిపివేస్తామని చెప్పారు. 27న విజయవాడలోని ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌ ఒకటవ తేదీన ఓదార్పుయాత్ర పేరుతో ఉద్యోగుల, ఉద్యోగం చేస్తూ మరణించిన కుటుంబాల, సిపిఎస్‌ ఉద్యోగుల సమస్యలు, కష్టాలు ఇళ్ల వద్దకు వెళ్లి తెలుసుకుంటామని పేర్కొన్నారు. మూడవ తేదీ కలెక్టరేట్లలో నిర్వహించే స్పందనలు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం, అధికారులు దిగిరాకపోతే 5వ తేదీ 94 సంఘాల ప్రతినిధులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. మలిదశ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని పేర్కొన్నారు. ఎక్కడా గొంతెమ్మ కోరికలు కోరడం లేదని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ఎవరో నడిపిస్తున్నారని ప్రభుత్వం, అధికారులు భావించాల్సిన అవసరం లేదన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు లేవని, చివరికి ఆరోగ్య సమస్యలు తీర్చుకునేందుకు ఆసుపత్రులలో కూడా హెల్త్‌ కార్డులు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యమం ప్రభుత్వంపై కాదని తమ హక్కులు, హామీల అమలు కోసమేనని స్పష్టం చేశారు. హెల్త్‌ కార్డులకు సంబంధించి ఏడాదికి రూ.250 కోట్లు ఉద్యోగులు ప్రభుత్వానికి వైద్య ఖర్చుల నిమిత్తం చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. కార్పొరేట్‌ ఆసుపత్రిలో వారికి లాభం ఉండే చిన్న చిన్న వైద్య సేవలు అందిస్తూ చేతులు దులుపుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో ప్రజల కోసం విధులు నిర్వహించి ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలను విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకటవ తేదీ జీతాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదర్‌రావు, రాష్ట్ర నాయకులు సాంబశివరావు, మల్లేశ్వరరావు, వైయస్సార్‌ జిల్లా చైర్మన్‌ జీవన్‌చంద్రశేఖర్‌, జనరల్‌ సెక్రటరీ కృష్ణకుమార్‌, ఉపాధ్యక్షులు పురుషోత్తం, కోశాధికారి రోనాల్డ్‌ శామ్యూల్‌ రాజ్‌, సెక్రటరీ అలీఖాన్‌, ఎపిపిటిడి డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ నరసయ్య, జోనల్‌ సెక్రటరీ రాజశేఖర్‌, ఆర్టీసీ రీజినల్‌ సెక్రటరీ రామమూర్తి, అన్ని సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.