ఇంగ్లాండ్ : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం క్రికెట్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఫార్మాట్ టి20. టి20లకు ఉన్న మజానే వేరు. సిక్సులు, ఫోర్లు.. ధనాధన్ వికెట్లు.. గాల్లో ఎగిరుతూ పట్టుకునే క్యాచ్‌లు.. రెప్పపాటులో స్టంప్ ఔట్లు.. రన్నవుట్లు.. ఇవి టి20లో ప్రతి ప్రేక్షకుడూ కోరుకునేది. మొత్తానికి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పొట్టి క్రికెట్‌లో దొరుకుతుంది. అయితే, టి20ని మించిన మరో ఫార్మెట్ టి10 కూడా ఉంది. ఈ మ్యాచుల్లో రెండు జట్లు కలిపి మొత్తం 120 బంతులను ఆడాల్సి ఉంది. అయితే, ఓ మ్యాచ్‌లో ఇప్పటి వరకూ ఎవరూ ఊహించని ఓ చెత్త రికార్డు నమోదైంది. టి10 పేరుతో నిర్వహించిన ఓ మ్యాచ్‌లో ఒక జట్టు కేవలం 8 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయింది. 58 బంతులు ఆడిన వీరు మొత్తం 7 పరుగులు చేశారు. ఛేదనలో ప్రత్యర్థి జట్టు కేవలం 8 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించడంతో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 56 బంతుల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ మ్యాచ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇంగ్లాండ్‌లో యార్క్‌షైర్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఈస్టర్టన్ క్లబ్, హిలమ్ అండ్ మాంక్ ఫ్రిస్టన్ క్రికెట్ క్లబ్‌ల మధ్య జరిగింది. అతి తక్కువ సమయంలో పూర్తయిన మ్యాచ్‌గా ఇది పేరుగాంచింది. ఈ మ్యాచ్‌లో హిలమ్ అండ్ ఫ్రిస్టన్ క్రికెట్ క్లబ్ మొదట బ్యాటింగ్ చేసింది. పరుగులు సాధించేందుకు బ్యాట్స్‌మెన్స్‌కు ఇష్టం లేదేమో.. వెంటవెంటనే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరారు. క్రీజులోకి వచ్చినంత సమయం కూడా బ్యాటింగ్ చేయడంలో చూపించలేదు. ఇలా మొత్తం 10 మంది ఆటగాళ్లు 8 ఓవర్లు ఆడి స్కోర్ బోర్డుపై 7 పరుగులను చేర్చారు. ఇందులో మొత్తం 8 మంది బ్యాట్స్‌మెన్స్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇద్దరు మాత్రం తలో 2 పరుగులు సాధించగా, 3 పరుగులు ఎక్స్‌ట్రాల రూంలో వచ్చాయి. ఈస్టర్టన్ క్లబ్ బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 3 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 8 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్టర్టన్ క్లబ్.. కేవలం 1.2 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. 10 వికెట్ల తేడాతో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈస్టర్టన్ క్లబ్ ఓపెనర్ జేమ్స్ కేంద్రా మొత్తం 8 బంతులు ఆడి ఒక ఫోర్‌తో మొత్తం 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్‌ట్రాగా వచ్చింది.










