Jan 03,2023 19:01

పింఛను పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి - రాయచోటి: జిల్లాలో కొత్తగా 7020 మంది లబ్దిదారులకు వైఎస్సార్‌ పింఛన్లు మంజూరు చేశామని కలెక్టర్‌ గిరీషపేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పింఛను కానుక కింద 62 లక్షల మంది లబ్దిదారులకు రూ.1,786.41 కోట్లు నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో లైవ్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ గిరీష, డిఆర్‌ఒ సత్యనారాయణ, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌ పింఛను కానుక కింద 7020 మంది లబ్దిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం పింఛనుదారులు 2,18,101 మందికి గాను రూ.6.51 కోట్లు ఇచ్చామన్నారు. సామాజిక భద్రత పింఛనుదారులకు ముఖ్యమంత్రి నూతన సంవత్సర కానుకగా పింఛను పెంపుదల చేశారని తెలిపారు. ఇప్పటి వరకూ రూ.2,500 తీసుకుంటున్న పింఛను ఈ నెల నుంచి రూ.2,750 అందిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ అబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రాలు అందజేశారు.