Dec 17,2022 21:19

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

           ప్రజాశక్తి-పెనుకొండ-ధర్మవరం   రాష్ట్రంలో 600 హామీలు ఇచ్చి అమలు చేయని ఏకైక వ్యక్తిగా చంద్రబాబు నిలిచిపోయారని మంత్రి, వైసిపి రాయలసీమ రీజినల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. శనివారం పెనుకొండలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఎమ్మెల్యే శంకరనారాయణ అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎంచుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా 98.4శాతం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్‌ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శంగా నిలిచారన్నారు. సమీక్ష సమావేశాలు ముగిసిన తరువాత ప్రతి నియోజకవర్గ పరిశీలకుడు ప్రతి మండలంలోని పర్యటించి కార్యకర్తల ప్రజల సమస్యలను తెలుసుకుని సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అసందృప్తితో ఉన్న అసమ్మతి నాయకులు, కార్యకర్తలను కలుపుకుని ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవాలన్నారు. ఇకపోతే చంద్రబాబు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా.. అన్నారు. ఇకపోతే 'రండి.. కలిసి మాట్లిడుదాం..' అంటూ అసమ్మతి నాయకులకు వేదిక నుంచి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కేసులు పెట్టించానని కొంత మంది అంటున్నారని వారందరు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సమక్షంలో మీ సమస్యలు చెప్పండి, తాను తప్పు చేసి ఉంటే మన్నించండి, 2024లో జగనన్నను సిఎంను చేద్దాం అంటూ పిలుపునిచ్చారు. కాగా మంత్రికి పెనుకొండ ఎజిపి ఎం.భాస్కర్‌ రెడ్డి పుష్పగుచ్చం అందించి దశ్యాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎడిసిసి బ్యాంక్‌ ఛైర్‌పర్సన్‌ లిఖిత, మాజీమంత్రి నర్సేగౌడ్‌, నియోజకవర్గ పరిశీలకులు బాబిరెడ్డి, ఎంఆర్‌సి.రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఫరూక్‌, వైస్‌ఛైర్మన్‌లు సునీల్‌, జయశంకర్‌రెడ్డి, ఎంపిపి గీతా రామ్మోహన్‌రెడ్డి, నాగలూరు బాబు, తయూబ్‌, బోయ బాబు, గోవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు
కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలని, సిఎం జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని వైసిపి రీజినల్‌ కో ఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ధర్మవరంలోని శ్రీనివాస ఫంక్షన్‌ హాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తన కుమారుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి అధ్వర్యంలో 12 నియోజకవర్గాల్లో వైసిపి విజయం సాధించిందన్నారు. రానున్న ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. రాష్ట్రంలో 31లక్షల మంది ఇళ్లులేని నిరుపేదలకు ఇంటిస్థలాలను మంజూరు చేసి గృహ నిర్మాణ సౌకర్యం కల్పించిన ఘనత సిఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చెబుతున్న బూటకపు మాటలతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌ నారాయణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, ఎపి కురుబ కార్పొరేషన్‌ అధ్యక్షుడు కోటి సూర్య ప్రకాష్‌ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, ఏడీసీసీ ఛైర్‌పర్సన్‌ లిఖిత, పామిడి వీరా, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, వైస్‌ ఛైర్మన్‌ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లింగం నిర్మల, ధర్మవరం ముదిగుబ్బ, తాడిమర్రి ఎంపిపిలు గిరిక రమాదేవి, ఆదినారాయణ యాదవ్‌, పాటిల్‌ భువనేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్లు యర్రగుంట భాగ్యలక్ష్మి, పెణుజూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.