జగన్ ప్రభుత్వం చేనేతలకు చేసింది శూన్యం
సంక్షేమ పథకాలు రద్దు చేసిన చరిత్ర జగన్‌ది
యువగలం పాదయాత్రలో నారా లోకేష్
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : జగన్ ప్రభుత్వం చేనేత కార్మికులకు, రైతులకు చేసింది శూన్యంమని, అడుగడుగునా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్ర 39వ రోజు మదనపల్లె మండలం పూలవాండ్లపల్లె నుండి ప్రారంభించి సిటియం పంచాయతీ-2 వద్ద పాదయాత్ర ప్రారంభించి 500 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పాదయాత్రలో రోడ్డు జన నీరాజనం పలికారు. బస్సులో వెళుతున్న వారికి కరచాలనం చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం అక్కడి నుండి పాదయాత్రను ప్రారంభించి ఎనుములవారిపల్లె సమీపంలో చేనేత కార్మికులు, కుటుంబ సభ్యులు, యజమానులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. చేనేతలకు గతంలో కల్పిస్తున్న సబ్సిడీ కరెంట్ బిల్లు, పట్టుపై సబ్సిడీ, ఇన్సూరెన్స్ సౌకర్యం వంటివి గతంలో ఉన్న వాటిని జగన్ ప్రభుత్వం తొలగించిందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. లోకేష్ స్పందిస్తూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని, ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తానని తెలిపారు. చేనేత మగ్గాల వారికి 200 యూనిట్లు, పవర్లూమ్స్ నేతలకు 5 యూనిట్లు ఉచితంగా ఇస్తానని చేతులెత్తేశారని విమర్శించారు. చేనేతలు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటే ఆదుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. వైయస్సార్ బీమా అని పేరు పెట్టి ఆ బీమానే లేకుండా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వైసిపి ప్రభుత్వంలో భద్రత విషయంలో కానీ, జీతాల విషయంలో కానీ, సమాన వేతనం కోసం టిడిపి హయాంలో అనేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన్నప్పుడు మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు మంచి జీతాలు ఇవ్వాలని మేము కంపెనీలను కోరేవాళ్ళం, మళ్లీ టిడిపి అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిశీలించి తప్పక పరిష్కరిస్తామన్నారు. హామీ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసింది చంద్రబాబు నాయుడని, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పండుగ కానుకలు, చంద్రన్న భీమా, పెళ్లి కానుకలు ఇచ్చింది చంద్రబాబు నాయుడే అన్నారు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, అన్న క్యాంటీన్,100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది సిఎం జగన్ కాదా అని ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నాడని అన్నారు. ఆర్టీసి ఛార్జీలు మూడు సార్లు పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలు పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి రూ.13లు తేడా ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన చరిత్ర జగన్‌కి మాత్రమే దక్కిందని ఆరోపించారు. అనంతరం భోజన విరామం తర్వాత ముస్లిం మైనారిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం అక్కడ నుండి పాదయాత్ర ప్రారంభించి స్థానిక ఆరోగ్యవరం సమీపంలోని మెడికల్ కాలేజీ నిర్మాణం వద్ద యువతతో సమావేశం నిర్వహించి, టిడ్కో ఇళ్లను పరిశీలించి స్థానిక దేవతనగర్ వరకు పాదయాత్ర కొనసాగించారు. రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం మదనపల్లి పట్టణంలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో మాజీ మంత్రులు అమరనాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దోమ్మలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, రాటకొండ బాబురెడ్డి, జయరాం నాయుడు, బి.శ్రీనివాస్, మస్తాన్, పటాన్ ఖాదర్ ఖాన్, పర్వీన్‌తాజ్, టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










