ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : శ్రీవారి నిత్యాన్నదానానికి నెలరోజుల వ్యవధిలో 50 టన్నుల కూరగాయలు వితరణగా ఇవ్వడం, పేదలు నివసించే కాలనీలలో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయడానికి మతం అడ్డురాదనే విషయాన్ని కె.జె.మండి యజమానులు దాదాపీర్, ఖాజాపీర్ నిరూపించారని ఆర్‌డిఒ ఎంఎస్.మురళీ కొనియాడారు. గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానానికి మదనపల్లె కే.జే కాయగూరల మండి నిర్వహకులు దాదాపీర్, ఖాజాపీర్ 12 టన్నుల కాయగూరలు, ఆకుకూరలు వితరణగా అందజేశారు. స్వంతం నిధులతో రెండు వాహనాలను సమకూర్చి కాయగూరలు తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్‌డిఒ మురళీ హాజరై జెండా ఊపి వాహానాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సేవ చేయడానికి మతం అడ్డురాదనే విషయాన్ని దాదాపీర్, ఖాజాపీర్ వారి సంతానం నిరూపించారని ప్రశంసించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు దేశంలోని నలుమూలల నుండి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారని వారికి నిత్య అన్నదానం కార్యక్రమం ద్వారా టిటిడి వారు అన్నప్రసాదం అందిస్తారన్నారు. అటువంటి బృహత్తర కార్యక్రమానికి కెజె కూరగాయల మండీ యజమానులు ఖాజాపీర్, దాదాపీర్ భాగస్వాములు కావడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సుధాకర్, ఇమ్రోజ్ పీర్, మస్తాన్, సయ్యద్, ప్రసాద్, మస్తాన్, భానుమూర్తి, కృష్ణారెడ్డి, నారాయణ స్వామి, చంద్ర, గణేష్, వెంకటరమణ, ప్రశాంత్, గంగిరెడ్డి, సుధీర్, ఆది, నరసింహులు, రాణి, రత్నమ్మ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.










