432 ఎకరాల భూమిని కాపాడాలి
ప్రజాశక్తి-సీతారామపురం : సీతారామపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 1 లో ఉన్న 432 ఎకరాల మేత పోరంబోకు భూమిని అక్రమార్కుల నుండి కాపాడాలని సీతారామపురం సర్పంచ్ కొడవటికంటి భాగ్యమ్మ ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై సోమవారం తహశీల్దార్ షాజియా బేగంకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 1లో ఉన్న భూమి చాలాకాలంగా మేత పోరంబోకు భూమిగా ఉంటూ పశువుల మేతకు ఉపయోగిస్తున్నామని, రికార్డులలో సైతం మేత పోరంబోకు భూమిగా ఉందన్నారు. కొందరు గత నెల 24వ తేదీన సర్వేలో నెంబర్ 1లో 47 ఎకరాలు వారిపై ఉందని అందులో నుండి 10 ఎకరాలు మరొకరికి అమ్మారని కోర్టు ఉత్తర్వులను చూపిస్తూ గ్రామ సర్వేయర్, సిబ్బందితో భూమి వద్దకు వచ్చి హద్దులు వేయించుకోవడంతో ఆ విషయం గ్రామస్తులకు తెలిసి కోర్టు నియమించిన ఏక సభ్య కమిషన్ వద్దకు వెళ్లి ఈ భూమి మేత పోరంబోకు భూమి అను ఈ భూమికి సంబంధించి ఎవరికీ ఎటువంటి పట్టాలు ఇవ్వరాదని కోరామన్నారు. అదేవిధంగా సర్వే నెంబరు 1లో ఉన్న భూమి రికార్డులను పరిశీలించి ఎటువంటి ఆక్రమనలకు గురికాకుండా మేత పోరంబోకు భూమిగానే ఉంచాలని తహశీల్దార్‌ను కోరామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద గౌస్, కృష్ణ బాబు, సురేషు, తమ్మిశెట్టి రమణయ్య, బోగినేని కాశయ్య, మాబు, బాల సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.










