Apr 01,2023 19:56

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు
3న చలో కలెక్టరేట్‌
నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్‌సి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 3న చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ పేర్కొంది. శనివారం డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌లో డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.వి.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రస్తుత సిఎం నిరుద్యోగులకు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా డిఎస్‌సి ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరును విమర్శించారు. రాష్ట్రంలో టిటిసి,బీఈడీ చేసిన అభ్యర్థులు దాదాపు 10 లక్షల మంది అభ్యర్ధులు డిఎస్‌సి నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. యువతకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మరిచి నిరుద్యోగులను నట్టెట్లో ముంచి వారి ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి ఇప్పటిదాకా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో దాదాపు 25 వేల పోస్టులకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే మన విద్యాశాఖ మంత్రి మాత్రం నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారని, కనీస అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బిపి నరసింహ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలు పరమావధిగా పరిపాల చేస్తున్నారే తప్ప , ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా ఎక్కడ ఆలోచన చేసిన పాపాన పోలేదన్నారు. అందుకే గ్రాడ్యుయేట్స్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో బలమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పాదయాత్ర సమయంలో యువతకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు కండె కోటేశ్వరరావు, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.