Apr 11,2022 07:36
  • జిల్లాల వారీగా అంచనాలు
  • సకాలంలో చెల్లింపులకు సిద్ధం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్‌ 2021-22లో 36,57,314 టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని పౌరసరఫరాలశాఖ భావిస్తోంది. 26 జిల్లాల నుండి ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేయాలో స్థానిక అధికారుల నుండి వివరాలు సేకరించారు. పశ్చిమగోదావరిలో 8.56 లక్షలు, కోనసీమలో 6.47లక్షలు, తూర్పుగోదా వరిలో 4.78లక్షలు, ఏలూరులో 3.92లక్షలు, కాకినాడలో 3.63లక్షలు, నెల్లూరులో 3.30లక్షలు, అల్లూరి సీతారామరాజులో 1.05లక్షలు, ఎన్‌టిఆర్‌ విజయవాడలో 1.04లక్షలు, పల్నాడులో లక్ష టన్నులు, బాపట్లలో 56వేల టన్నులు, ప్రకాశంలో 51వేల టన్నులు, చిత్తూరులో 29వేలు, శ్రీకాకుళంలో 28వేల టన్నులు, కృష్ణాజిల్లాలో 19వేల టన్నులు, అన్నమయ్య జిల్లాలో 19వేల టన్నులు, అనంతపురంజిల్లాలో 15వేల టన్నులు, వైఎస్‌ఆర్‌ కడపలో 14వేల టన్నులు, నంద్యాలలో 13వేల టన్నులు, విజయనగరంజిల్లాలో 6వేల టన్నులు, మన్యం జిల్లాలో 6వేల టన్నులు, శ్రీసత్యసాయి జిల్లాలో 5వేల టన్నులు, అనకాపల్లిలో 3వేల టన్నులు, కర్నూలులో 2వేల టన్నులు, గుంటూరులో 2వేల టన్నులు, విశాఖపట్నంలో వెయ్యి టన్నులు, తిరుపతిలో 300 టన్నుల చొప్పున ధాన్యం వచ్చేందుకు అవకాశం ఉంది. వీటిలో కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని 114 మండ లాల్లో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1,427 రైతుభరోసా కేంద్రాలు (ఆర్‌బికె)లను అధికారులు ప్రారంభించగా, వీటిలో 357 ఆర్‌బి కెలు ధాన్యం సేకరణను ఇప్పటికే ప్రారంభించాయి. ఖరీఫ్‌లో ఎదురైన ఆర్థిక సమస్యలను అధిగమించేం దుకు అన్ని చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రబీ సీజన్‌కు సంబంధించిన చెల్లింపులు అనుకున్న విధంగా 21రోజుల్లో రైతు ఖాతాల్లోకి వేసేందుకు నిధులు సమకూర్చుకుని ధాన్యం సేకరణ ప్రారంభించామని వెల్లడించారు. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆర్‌బికెల్లోని అధికారులు ధాన్యం సేకరిస్తారని తెలిపారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులు, మిల్లర్లకు అమ్ముకుని నష్టపోవద్దని కోరారు.