Jul 26,2022 23:10

ప్రజాశక్తి-విజయవాడ: ఈ నెల 31న అజిత్‌సింగ్‌నగర్‌ కృష్ణా హోటల్‌ సెంటర్‌లో జరుగుతున్న విజయవాడ సెంట్రల్‌ సిటీ నగర డివైఎఫ్‌ఐ మహాసభను యువతీ యవకులు విజయవంతం చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.కృష్ణ కోరారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని కృష్ణహౌటల్‌ సెంటర్‌ ప్రజాసంఘాల కార్యాలయంలో నగర ఉపాధ్యక్షులు ఎస్‌కె నిజాముద్దీన్‌తో కలిసి కృష్ణ మంగళవారం మాట్లాడారు. డివైఎఫ్‌ఐ నగరంలో యువతీ యువకుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నగరంలో నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. ఉపాధి కల్పన లేక యువత చెడు మార్గాన పయనిస్తుందన్నారు. అనేక మంది పేద మధ్యతరగతి యువకులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యసనాలకు బానిస అయ్యి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అందరికీ విద్య - అందరికీ ఉపాధి నినాదంతో డివైఎఫ్‌ఐ పనిచేస్తుందన్నారు. నిరుద్యోగులను కలుపుకుని ఇప్పటికే విజయవాడ నగరంలో అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అలాగే స్థానిక సమస్యలపై కూడా డివైఎఫ్‌ఐ పనిచేస్తుందన్నారు. పోరాటాలు మాత్రమే కాక సేవా కార్యక్రమాల్లో కూడా యువజన సంఘం ముందుంటుందన్నారు. వివేకానంద చేయూత పేరుతో అనేకమందికి ఆహారం, నిత్యవసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు. భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ పేరుతో ఇప్పటికే అనేక మందికి రక్తదానం చేశామన్నారు. యువతలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకై క్రీడా టోర్నమెంట్లను నిర్వహించడం జరిగిందన్నారు. ఇలా బహుముఖ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ సమావేశంలో నగర నాయకులు ఎన్‌. దుర్గాప్రసాద్‌, ఎస్‌.కె రసూల్‌ పాల్గొన్నారు.