- విమానాశ్రయాల్లో ప్రైవేట్ సెక్యూరిటీకి విధుల కేటాయింపు
- నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం : కేంద్ర హోం మంత్రికి శివదాసన్ లేఖ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రధాన భద్రతా సవరణలో భాగంగా మూడు వేలకు పైగా సిఐఎస్‌ఎఫ్ పోస్టులు రద్దు చేశారు. దీనికింద నిఘా, రక్షణ కోసం స్మార్ట్ టెక్నాలజీ టూల్స్ సహాయంతో ప్రైవేట్ భద్రతా సిబ్బంది నాన్-సెన్సిటివ్ సాంకేతికత సహాయంతో విధులను అందించనుంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్), సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) క్షేత్ర కార్యాలయాలతో పాటు కేంద్ర పౌర విమానయాన, గృహ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించిన 2018-19 కార్యాచరణ ప్రణాళిక ఇప్పుడు 50 పౌర విమానాశ్రయాల్లో అమలవుతోంది. బిసిఎఎస్ ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం మొత్తం 3,049 సిఐఎస్‌ఎఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ పోస్టులను, 1,924 ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో భర్తీ చేస్తారు. సిసిటివి కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్‌ల వంటి స్మార్ట్ నిఘా సాంకేతికతను సమాంతరంగా ప్రవేశపెట్టింది. ఎయిర్‌పోర్టుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ సెక్యూరిటీ టెక్నాలజీ, నాన్‌సెన్సిటివ్ సెక్యూరిటీ సిబ్బందికి అవకాశం కల్పించే మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిఎఎస్ జాయింట్ డైరెక్టర్ జనరల్ (జెడిజి) జైదీప్ ప్రసాద్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో మోహరించే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, వారి సిబ్బందిని బిసిఎఎస్ ఆమోదిస్తుందని, వారు విమానయాన భద్రత కోసం రూపొందించిన నిబంధనల ప్రకారం, తమ ఆధ్వర్యంలో నిర్వహించబడతారని ఆయన చెప్పారు.
దేశంలో నిరుద్యోగ యువతకు
తీవ్ర నష్టం : వి.శివదాసన్
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో 3,049 సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) పోస్టులను రద్దు చేయడంపై సిపిఎం రాజ్యసభ వి. శివదాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని, పోస్టుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో కోరారు. ''సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రైవేటీకరించడం దేశంలోని నిరుద్యోగ యువతకు హానికరమైన చర్య. ఒకవైపు ఉపాధి కోసం యువత ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు'' అని లేఖలో పేర్కొన్నారు. అగ్నిపథ్ వంటి రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్‌ల కింద సాయుధ బలగాల పోస్టులను కాంట్రాక్టీకరణ చేయడంతో దేశంలోని యువతకు సాధారణ ఉపాధి సుదూర స్వప్నంగా మారుతుందని తెలిపారు. 3,049 రద్దు చేయబడిన సిఐఎస్‌ఎఫ్ పోస్టులు ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ (ఎఎస్‌జి)లో 10 శాతానికి దగ్గరగా ఉన్నాయని తెలిపారు. '' దేశంలో సాయుధ దళాల్లో ఇప్పటికే 1,27,000 కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవడానికి బదులుగా, పోస్టులను రద్దు చేయాలనే చర్య సాధారణ ఉపాధి కోసం ఎదురుచూసే యువకుల ప్రయోజనాలకు విరుద్ధం'' అని లేఖలో పేర్కొన్నారు. ''విమానయానం బాగా ప్రాచుర్యం పొందుతూ కొత్త విమానాశ్రయాలు వస్తున్న ఈ సమయంలో విమానయాన భద్రత నిర్వహణలో నిమగమైన పారామిలిటరీ సిబ్బంది సంఖ్యను తగ్గించాలనే నిర్ణయం విమానాశ్రయాల భద్రతకు హాని కలిగించే చర్య'' అని అన్నారు.










