29న వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: తెలుగు ప్రజల ప్రాతఃస్మరణీయుడు సమాజంలోని రుగ్మతలపై అక్షరాన్ని పద్యరూపంలో ఝళిపించిన మహనీయుడు వేమన పేరిట తిరుపతి నగరంలో విజ్ఞాన కేంద్రాన్ని 29వ తేదీ ఆదివారం ప్రారంభించనున్నట్టు వేమన విజ్ఞాన కేంద్రం ట్రస్టు ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున తెలిపారు. యశోదానగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో నాగార్జునతో పాటు తిరుపతి బాలోత్సవం అధ్యక్షులు టెంకాయల దామోదరం, నడ్డి నారాయణ, పయ్యావుల గురునాథం, మునిలక్ష్మి, పసల మునిరామయ్య ప్రసంగించారు. వేమన విజ్ఞాన కేంద్రం పేరిట తిరుపతి నగరంలో కరోనా కాలం నుంచి పలు సామాజిక, సేవా, సాంస్కతిక, చైతన్య పూరిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 29వ తేదీ వేమన విజ్ఞాన కేంద్రం భవనాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు, విశ్లేషకులు తెలకపల్లి రవి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, సమతా స్వాప్నికుడు వేమన పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త విఠపు బాలసుబ్రమణ్యం ఆవిష్కరిస్తారని వారు తెలిపారు. అలాగే ప్రముఖ మార్క్సిస్టు నేత, మదనపల్లికి చెందిన న్యాయవాది దివంగత పలవలి రామకష్ణారెడ్డి పేరిట నిర్మించిన సభా మందిరాన్ని ఆయన కుమార్తె మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పలవలి కుసుమ కుమారి ప్రారంభిస్తారని, ప్రముఖ అభ్యుదయ అనువాద రచయిత ఏజీ యతిరాజులు పేరిట నిర్మించిన సభా మందిరాన్ని ఏజీ చంద్రమ్మ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో వేమన పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలలో తిరుపతి జిల్లాలో విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న పాత్ర గణనీయమైందని అన్నారు. రాయలసీమ ప్రజానీకం, యావత్ తెలుగు ప్రజలు మహనీయుడు వేమన స్ఫూర్తితో నిర్వహించనున్న వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.నారా భువనేశ్వరికి వీడ్కోలు పలుకుతున్న రవి నాయుడు










