Mar 26,2022 16:16

ప్రజాశక్తి - నంద్యాల : దేశవ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఇచ్చిన పిలుపు మేరకు మోడీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై  మార్చి 28,29 రెండు రోజుల పాటు జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సిఐటియు కార్యాలయం నుండి బైక్ ర్యాలీని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి ప్రారంభించారు.  ర్యాలీలో పాల్గొని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత వేగవంతంగా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదించి కార్మికులను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా చేయాలని చూస్తోందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మివేయడం చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఉద్యోగులంతా అనేక రూపాల్లో పోరాటం చేశారని, అయినా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని అన్నారు. పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని వెంటనే మానుకోవాలని అన్నారు. కరోనా కష్టకాలంలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సాయం చేయలేదు కేవలం చప్పట్లు కొట్టండి,దీపాలు ఆర్పండి,పూలు చల్లండని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసింది తప్ప ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు  కొనుక్కునేందుకు ఆర్థికంగా సహాయం చేయలేదని,  పగలంతా ఇంట్లో ఉండండి అని చెప్పి చేతులు దులుపుకొందని,పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు తలుపులు తెరిచి దేశాన్ని దోచుకుతినే  రీతిలో ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించడం జరిగిందని అన్నారు . మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేసిన పోరాటానికి తలదించి రద్దు చేసుకున్న రైతాంగ పోరాట  స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం 2014,2019లో అధికారంలోకి రావడం కోసం విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, కార్మికులకు, ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు కార్మికులు కలిసి అందరిని ఐకమత్యంగా రెండు రోజులపాటు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు.అప్పుడే మోడీ ప్రభుత్వం మెడలు వంచగలరని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈనెల 28వ తేదీన మార్కెట్ యార్డ్ నుండి శ్రీనివాస సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు వేలాది మంది కార్మికులతో జరిగే ర్యాలీ సభను జయప్రదం చేయాలని 29వ తేదీన బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. సిపిఎం పట్టణ కార్యదర్శి  పుల్లా నరసింహులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సద్దాం హుస్సేన్ ర్యాలీ లో పాల్గొని మాట్లాడుతూ  కార్మిక ,రైతాంగ, వ్యవసాయ కార్మికుల హక్కులను కాలరాస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. కార్మిక వర్గం చేస్తున్న రెండు రోజుల పాటు జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇచ్చి పాల్గొంటామని అన్నారు. ఈ ర్యాలీ ప్రభుత్వాసుపత్రి మీదుగా సాయిబాబా నగర్ , టెక్కె, పద్మావతి నగర్, మున్సిపల్ ఆఫీస్, సంజీవ నగర్ ,ఆర్టీసీ బస్టాండ్, బంగారు అంగళ్ళవీధీ, గాంధీ చౌక్ ,శ్రీనివాస సెంటర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అధ్యక్షులు వి.ఏసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తోట.మద్దులు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ పట్టణ కోశాధికారి వెంకట లింగం నాయకులు వీర సేన జైలాన్ , సుబ్బారావు,గోపాల్  పాల్గొన్నారు.