ప్రజాశక్తి - విలేకర్ల యంత్రాంగం:కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. సమ్మె జయప్రదానికి సిఐటియు ఆధ్వర్యాన విస్తృతంగా సన్నాహాక కార్యక్రమాలు చేపడుతున్నారు.
విశాఖ పోర్టు ప్రైవేటీకరణ చర్యలు విడనాడాలి
ములగాడ : విశాఖ పోర్ట్ ప్రైవేటీకరణ చర్యలు మోడీ ప్రభుత్వం విడనాడాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. బోత్రా గొడౌన్ వద్ద జరిగిన పోర్టు కళాశీల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని పోర్టులను మోడీ తన మిత్రుడు అధానీకి ధారాదత్తం చేస్తున్నారన్నారు. పోర్టుల ప్రైవేటీకరణవల్ల ఉపాధికి, దేశ ఆర్థిక రంగానికి, దేశ భద్రతకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెను, నగర బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్ అధ్యక్షులు పి.పైడిరాజు మాట్లాడుతూ బోత్రా యజామాన్యం జెపిఎల్ 2 సైడింగ్‌లో జిప్సం ఆపరేషన్ చేపట్టి ప్రజల ఆరోగ్యాలను, 300 మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సిహెచ్.రాంబాబు, ఎస్.రామారావు, జి.అప్పలనాయుడు, మేస్త్రీలు ఎం.రమణ, శ్రీరామ్మూర్తి, చిన్నారావు, దేవుడుబాబు, రామకృష్ణ, సన్యాసినాయుడు, శ్రీను పాల్గొన్నారు.
సంతలో ప్రచారం
కొయ్యూరు : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని డౌనూరు సంతలో సిఐటియు నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై.అప్పలనాయుడు, పి.బొంజ్జన, చిట్టిబాబు, చంటిబాబు, కృష్ణ, కొండబాబు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
అనకాపల్లి : దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రూపొందించిన వాల్ పోస్టర్‌ను స్థానిక కార్మిక కర్షక భవనంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలైతే కార్మికులు పోరాడి సాధించుకున్న పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి పథకాలు కోల్పోతారన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, సిఐటియు డివిజన్ కార్యదర్శి పిఎన్‌వి పరమేశ్వరరావు, జిల్లా నాయకులు గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
సన్నాహాక సమావేశం
మునగపాక రూరల్ : సమ్మె విజయవంతానికి స్థానిక పిఎసిఎస్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం మండలంలోని కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి వివి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు బ్రహ్మాజీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, కాండ్రేగుల రాము, డి రమణ, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వీఆర్‌ఎలు పాల్గొన్నారు.
ఫార్మా యాజమాన్యాలకు సమ్మె నోటీసులు
పరవాడ : ఈ నెల 28 29 తేదీల్లో సమ్మె చేస్తున్నట్లు ఫార్మాసిటీలో పరిశ్రమ యాజమాన్యాలకు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యాన శుక్రవారం సమ్మె నోటీసును అందజేశారు. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమ్మెలో పాల్గొంటాం : ఎల్‌ఐసి ఉద్యోగులు
నర్సీపట్నం టౌన్ : మార్చి 28, 29 తేదీలలో జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని ఎల్‌ఐసి ఉద్యోగులు తెలిపారు. సార్వత్రిక సమ్మెపై శుక్రవారం ఎల్‌ఐసి ఉద్యోగుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, స్టీల్ ప్లాంట్ వంటి వాటిని అమ్మకూడదని, ఎల్‌ఐసిలో ఐపిఒ తీసుకురాకూడదని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి నర్సీపట్నం బేస్ యూనిట్ కార్యదర్శి చిన నూకరాజు, అధ్యక్షులు చక్రధర్, సిఐటియు నాయకులు డి.సత్తిబాబు పాల్గొన్నారు.










