28, 29 తేదీల్లో జాతీయ సమ్మె దేశ రక్షణ, ప్రజల భవిష్యత్ కోసమే..
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో :ఈ నెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మె దేశ రక్షణ, దేశ ప్రజల భవిష్యత్ కోసం జరుగుతుందని, దీంట్లో ప్రజలంతా పాల్గొనాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖలోని ఎన్‌పిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కార్మిక, ఉద్యోగ, ప్రజలపైనా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని, ఈ సమ్మె కేవలం కార్మికవర్గానికి మాత్రమే కాదని, దేశ రక్షణ కోసమని పేర్కొన్నారు. యుపి ఎన్నికల తర్వాత కేంద్రం దూకుడుగా దాడి చేస్తుందని, గడచిన 40ఏళ్లలో ఎన్నడూలేని విధంగా పిఎఫ్‌పై వడ్డీరేటును 8.52శాతం నుంచి 8.1శాతానికి తగ్గించేసిందని తెలిపారు. ఇజ్రాయెల్ దేశం ప్రభుత్వాలకే నేరుగా పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇస్తుందని కేంద్ర హోంశాఖ అనడం సరికాదని, పెగాసస్‌లో పాత్రదారులను తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు ఎవరెవరికీ ఏపిలో ఇచ్చిందో చెప్పాలన్నారు. తాజాగా మమతా బెనర్జీ టిడిపి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై హౌస్‌కమిటీ నిజానిజాలు తేల్చాలన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బయట నుంచి ఎవరికైనా మద్దతిస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయం గురించి మాట్లాడతామన్నారు.
సమ్మెను వైసిపి, టిడిపి బలపర్చాలి..
కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, రైల్వే జోన్ ఊసెత్తడం లేదని, విభజన హామీలు ఏవీ అమలు చేయలేదని, పైపెచ్చు రాష్ట్ర ఆదాయ వనరులపై కేంద్రం పెత్తనం చేస్తూ ప్రజలపై భారాలు వేస్తుందని తెలిపారు. ఇటువంటి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28 29 తేదీల్లో జరుగనున్న సమ్మెలో వైసిపి టిడిపి భాగస్వామ్యం కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మా రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోమని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రాన్ని హెచ్చరించాలన్నారు.
సహకార డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి
రాష్ట్రంలో సహకార రంగం లాభాలతో నడుస్తున్నా వాటిని అమ్మేయాలనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సరైంది కాదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో గ్రామాల్లో రైతాంగాన్ని కాస్తో కూస్తో డెయిరీలే ఆదుకుంటున్నాయని, ప్రభుత్వ విధానాల వల్ల అవి నేడు మూతపడే దశకు వచ్చాయని పేర్కొన్నారు. మన రాష్ట్ర సంపదను గుజరాత్‌కు చెందిన అదానీకి కట్టబెడుతున్నారని, గంగవరం పోర్టు అమ్మేయగా, తాజాగా గుజరాత్‌కు చెందిన అమూల్‌కు పాల వ్యాపారాన్ని కట్టబెట్టే చర్యలు తీసుకుందని తెలిపారు. నగరాల్లో చెత్తపన్ను, ఆస్తిపన్ను వేయడానికి వీల్లేదన్నారు. సచివాలయ వ్యవస్థ సిబ్బందిని ఈ ప్రభుత్వం బిల్లు కలెక్టర్లుగా వాడుతుందన్నారు.
సిపిఎస్‌ను రద్దు చేయకపోవడం, ఇపిఎఫ్‌పై వడ్డీ రేటును తగ్గించేయడంతో రాష్ట్రంలో ఉద్యోగుల భవిష్యత్‌ను ప్రభుత్వం బజారున పడేసిందన్నారు. విద్యుత్ ఛార్జీలు ఈ ఏప్రిల్ నుంచి భారీ పెరిగి ప్రజలపై భారం కానున్నాయన్నారు. పార్లమెంట్‌లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చట్టం, రైతులకు నష్టం కలిగించే విద్యుత్ మీటర్లు బిగించి ఛార్జీలు వసూలు చేసే విధానంపై పోరాడాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగానూ, సహకార చక్కెర ఫ్యాక్టరీల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని శ్రీనివాసరావు సూచించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా అని భారాలు వేస్తే ప్రజలు కట్టడానికి సిద్ధంగా లేరన్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కొనడం వైసిపి విధానంగా కనిపిస్తుందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని, రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సిహెచ్.నర్సింగరావు, విశాఖ జిల్లా, నగర కార్యదర్శులు కె.లోకనాథం, ఎం.జగ్గునాయుడు పాల్గొన్నారు.










