ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు ఆర్‌టిసి ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్‌టిసి ఉద్యోగులంతా రెండు రోజులపాటు ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎపి పిటిడి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్లు పలిశెట్టి దామోదరరావు, వై శ్రీనివాసరావు, కో కన్వీనర్లు సిహెచ్ సుందరయ్య, వైఎస్ రావు, ఎన్‌ఎంయు రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కె జిలాని బాషా శనివారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్‌టిసి వంటి ప్రజా రవాణా సంస్థలను నష్టాల్లోకి నెట్టే నిర్ణయాలను తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో అన్ని డిపోల ముందు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.










