Sep 03,2022 23:11

ప్రజాశక్తి -ఇబ్రహీంపట్నం/నందిగామ
కార్పొరేట్‌, మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఎం దేశ వ్యాప్తంగా పోరాడుతుందని దీనిలో భాగంగా ఈనెల 25వ తేదీన విజయవాడలో జరిగే సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డివి కష్ణ పిలుపునిచ్చారు. శనివారం ఇబ్రహీంపట్నం కామ్రేడ్‌ వెలగా లక్ష్మణరావు భవనంలో సిపిఎం పట్టణ కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం బహిరంగ సభను జయప్రదం కోరుతూ సెప్టెంబర్‌ 14వ తేదీ నుండి 24వ తేదీ వరకు సిపిఎం ఇంటింటికి సర్వే క్యాంపెయిన్‌, కరపత్రాలు పంపిణీ, పాదయాత్రలు, గ్రూప్‌ మీటింగ్‌ నిర్వహిస్తూ బిజెపి ప్రజా మతోన్మాద వ్యతిరేక విధానాలను ప్రజల దష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అప్రకటిత అత్యవసర పరిస్థితులు అమలు చేస్తుందని ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్‌ డిపార్ట్మెంట్‌, సిబిఐ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఉన్న బిజెపి వ్యతిరేక పాలక పార్టీలను కూలదొస్తుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి ఆయా ప్రభుత్వాలను అస్థిర పరుస్తుందన్నారు . మరోపక్క బ్యాంకులను ,ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు కారు చౌకగా కట్టబెడుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిత్రులైన గౌతమ్‌ అధాని, అంబానీ ఆస్తులు ఆకాశానికి ఎగబాగుతుంటే, మరోపక్క ప్రజల సంపద పాతాళానికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెరిగి ఆదాయం తగ్గి స్థిర ఉపాధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. కార్పొరేట్‌ పెట్టుబడులపై లాభాల కోసం కార్మిక చట్టాలను వారికి అనుకూలంగా మార్పులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, టిడిపిలు కేంద్ర ప్రభుత్వ విధానాలను పార్లమెంట్‌ లో ఆరోపించారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య ప్రజలకు గందరగోళాన్ని గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పుల రద్దుచేసి ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉచితాల కింద ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు దేశాభివద్ధికి తోడ్పడ విధంగా ప్రచారం చేయడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వైసిపి ప్రభుత్వం , దాని ఖండిచాల్సిన టిడిపి బిజెపి భజన చేస్తుందని, నేడు ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేస్తుందన్నారు. ఈనెల 25వ తేదీన విజయవాడలో జరిగే సిపిఎం బహిరంగ సభకు సిపిఎం ఆల్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం ముఖ్య అతిధిగా హాజరవుతున్న ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. .ఈ కార్యక్రమంలో సిపిఎం కొండపల్లి టౌన్‌ సెక్రటరీ యం.మహేష్‌ , సిపిఎం టౌన్‌ కమిటీ సభ్యులు ఎ విఠల్‌ రావు , ఈ కొండలరావు, ఎన్‌ ప్రకాష్‌, కె బేబీ సరోజినీ, పార్టీ సభ్యులు ఎల్‌ పార్వతీ, ఎస్‌ వెంకట్రావమ్మ, ఎన్‌ బాబ్జి, విలియమ్స్‌, అచ్యుత్‌, రాజేశ్వరి పాల్గొన్నారు.