Oct 19,2022 22:50

ప్రజాశక్తి-విజయవాడ: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 22న న్యాయ సేవా సదస్సు జరుగుతుందని, ఈ సదస్సును విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. ఈసదస్సు ఏర్పాట్లపై బుధవారం నగరంలోని కలెక్టరేట్‌ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ డిల్లీరావు, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి జస్టిస్‌ ఎ.పద్మ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే సదస్సులో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి పలు అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌పిడబ్ల్యు 2016 యాక్ట్‌పై అవగాహన కల్పించాలన్నారు. చైల్డ్‌లైన్‌ 1098, పోలీస్‌ 100 లేదా 112 ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181 వంటి సేవలపై పోస్టర్లు ముద్రించి ప్రదర్శించాలన్నారు. విభిన్నప్రతిభావంతులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేసేందుకు సిద్దం చేయాలన్నారు. సివిల్‌ జడ్జి ఎ.పద్మ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే సమస్యలు, మాదకద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు, ప్రజలకు చట్టాలపై సీనియర్‌ న్యాయవాదులతో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డిఇవో సివి రేణుక, విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి రామకుమార్‌, ఐసిడిసి పిడి జి.ఉమాదేవి, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ పి.శ్రీనివాసరావు, సిడివో యం.దుర్గాప్రసాద్‌, డిటిడబ్ల్యుఓ ఎం.రుక్మాందయ్య, చైల్డ్‌లైన్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ ఆరవ రమేష్‌, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.