న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో వాయిదా పడిన జెఇఇ మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్ పరీక్ష ఈనెల 20 నుంచి 25 వరకు, నాలుగో సెషన్ పరీక్షలు 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిం చనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) మంగళవారం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వీడియో ప్రకటనలో వెల్లడించారు. మూడో సెషన్‌కు సంబంధించి మంగళవారం రాత్రి నుంచి గురువారం వరకు రిజిస్ట్రేషన్ చేసు కోవచ్చని, నాలుగో సెషన్‌కు ఈనెల 9 నుంచి 12 వరకు ఎన్‌టిఎ వెబ్‌సైట్‌లో ఓపెన్‌లో ఉంటుంద న్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా మార్పులు చేసుకోవచ్చునని తెలిపారు. పరీక్షలకు సంబంధించి మంత్రి ట్వీట్‌పై విద్యార్థులు స్పందిస్తూ.. రెండు సెషన్ల మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉందని, కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. వాస్తవానికి ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలనుకున్న ఈ రెండు సెషన్లు రెండో దశ కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడ్డాయి. మొదటి రెండు సెషన్లు ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే.










